మిజోరంలో స్టోన్ క్వారీ కుప్ప కూలిన ఘటనలో ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో నలుగురు ఆచూకీ లభించాల్సి ఉంది. ఒకరు సురక్షితంగా బయటపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. మిజోరంలోని హ్నాథియల్ జిల్లాలో సోమవారం ఓ రాతి క్వారీ కూలిపోవడంతో దాని కింద 13 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో మౌదర్ గ్రామం వద్ద క్వారీ కూలిపోయింది. మారుమూల ప్రాంతం కావటంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఈ రోజు ఉదయం బిఎస్ ఎఫ్ , ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఏబిసిఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన క్వారీలో కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
క్వారీ కూలిపోయిన సమయంలో దాదాపు 13 మంది వ్యక్తులు ఆ ప్రదేశంలో ఉన్నట్లు భావిస్తున్నామని మిజోరాం విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ అదనపు కార్యదర్శి లాల్‌హ్రియత్‌పుయా తెలిపారు. క్రూడ్ పద్ధతిలో క్వారీయింగ్ చేయడమే ఈ విషాదానికి కారణమైందని ఆయన అన్నారు. చనిపోయిన వారంతా బీహార్ కు చెందిన వారని సమాచారం. మధ్యాహ్న భోజన విరామం పూర్తి చేసుకుని తిరిగి పని కోసం క్వారీలోకి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని గ్రామాలకు చెందిన యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ) వాలంటీర్లు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కూలీలు క్వారీలో రాళ్లను పగులగొట్టి సేకరిస్తున్న సమయంలో పై నుంచి వదులుగా ఉన్న మట్టి మీద పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.