గాబ్రియెల్ తుపాను ధాటికి న్యూజిలాండ్ అతలాకుతలం అవుతున్నది. తుఫాను విరుచుకుపడి వారం రోజులు పూర్తైనా ఇంకా ఆ దేశం కోలుకోవడం లేదు. ఈ విపత్తులో 11 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించినా వందల మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. ఫిబ్రవరి 12న న్యూజిలాండ్ ఉత్తర భాగాన్ని తాకిన ఈ తుఫాను గత శతాబ్ద కాలంలో తమ దేశంలో సంభవించిన అతి పెద్ద ప్రకృతి విపత్తని ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ పేర్కొన్నారు. ఇప్పటికి 6,431 మంది ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. తుపాను తీవ్రతకు దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిందని, మంచి నీటి కొరత ఏర్పడిందని, పంటలు నాశనమయ్యాయని చెప్పారు.
వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ దేశ మంత్రి కీరన్ మెక్‌అనుల్టి డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ తుఫాన్ నార్త్ ఐలాండ్‌లో చాలావరకు పెద్ద ప్రభావాలను చూపుతోందని మెక్‌అనుల్టి చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించడం ఇది మూడోసారి. గతంలో 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్ర దాడులు, 2020లో కొవిడ్ మహమ్మారి కారణంగా ఎమర్జెన్సీని విధించింది. తాజాగా గాబ్రియెల్ తుఫాన్ నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.