Sunday, January 19, 2025
HomeTrending Newsఇప్పటికీ ముందంజలో "కెల్లాగ్ ఫ్లేక్స్"

ఇప్పటికీ ముందంజలో “కెల్లాగ్ ఫ్లేక్స్”

Kelloggs Flakes : దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం అమెరికన్ల ఆహారం అధిక కొవ్వుతో కూడినదై ఉండేది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు ఓ చర్చి ప్రతినిధులు కొందరు ప్రజల ఆరోగ్యంపట్ల దృష్టి సారించారు. పుష్టికరమైన ఆహారం తయారుచేయమని వైద్యుడు, పౌష్టికాహర నిపుణుడు అయిన జాన్ హార్వే కెల్లాగ్ (1852-1943) ను విజ్ఞప్తి చేశారు.

అప్పుడు ఆయన, తన తమ్ముడు విల్ కీత్ కెల్లాగ్ (1860-1951) కలిసి ఓ ఆహారోత్పత్తుల సంస్థను నడుపుతున్న రోజులవి. మొదట్లో వీరి సంస్థ పేరు శానిటాస్ ఫుడ్ కంపెనీ. తర్వాతి కాలంలో ఇది కెల్లాగ్ సంస్థగా మారింది. కెల్లాగ్ సోదరులు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఫ్యామిలీకీ చెందిన వారు.

జనం ఆరోగ్య రీత్యా దృష్టిలో పౌష్టికాహారమైన ఒక రొట్టెను తయారు చేయడానికి ప్రయత్నించారు. అయితే అది సరిగ్గా కుదరలేదు.

ఓరోజు రొట్టె తయారు చేయడానికి గోధుమపిండిని ఓ పాత్రలో ఉంచిన విల్ కీత్ ఆ సంగతి మరచిపోయాడు. పనంతా కానిచ్చుకున్న విల్ కీత్ కి గోధుమపిండి విషయం గుర్తుకొచ్చింది. అప్పటికి పిండంతా గిన్నెకు అతుకుపోయింది. అంత పిండిని పారేయడం ఇష్టంలేక ఏం చేయాలా అని ఆలోచించాడు. పిండిని ఉడికిస్తే దేనికైనా ఉపయోగపడుతుందేమో అనుకున్న విల్ కీత్ రోలర్లలో పెట్టగా అది కాస్తా రేకుల్లా విడివిడిగా కిందపడ్డాయి. దానిని పెనంమీద వేసి వేడి చేసాడు. ఓ రెండు మూడు ముక్కలు నోట్లో వేసుకుంటే ఓ కొత్త రుచిలా అన్నించింది. అది బాగుందేమో చూడమని ఓ మూడు రేకులు తన సోదరుడు జాన్ హార్వేకు ఇచ్చాడు.

అతనికీ అవి రుచిగా అన్పించాయి. అదేదో బాగుందనుకున్న కెల్లాగ్‌ సోదరులు వాటిని పెనంలాంటి దానిపై కాల్చారు. అనంతరం వాటిని కొందరు రోగులకు పెట్టారు. వాళ్ళెంతో ఇష్టపడి తిన్నారు. విపరీతంగా నచ్చేశాయి. అది గమనించిన కెల్లాగ్ సోదరులు ఆలోచనలో పడ్డారు. దానిపై ప్రయోగాలు చేశారు. రాగులు, మొక్క జొన్నల వంటి వివిధ ధాన్యాలను ఉపయోగించి రకరకాల “ఫ్లేక్స్” తయారుచేశారు. అనంతరం ఒక్కొక్క తయారీని అమ్మడం మొదలుపెట్టారు. కెల్లాగ్ సోదరులు తమ జీవితకాలంలో వందకుపైగా ఆహారపదార్థాల ఉత్పత్తులు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.

వీరి ఆహారోత్పత్తులు బాగా రుచిగా ఉండటంతో మంచిపేరు వచ్చింది. అలాగే లాభాలు వచ్చాయి. ఓ దశలో విల్‌ కీత్ కెల్లాగ్‌ రుచి కోసం వీటిల్లో కాస్త పంచదార కలపడం మొదలు పెట్టాడు. కానీ అది జాన్‌కు నచ్చలేదు వారి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. వ్యాపారంలో విడిపోయారు. ఏదైతేనేం వినియోగ దారులకు బలవర్ధకమైన, రుచికరమైన ఫ్లేక్స్ తయారై ఇప్పటికీ అందుబాటులో ఉండటం విశేషం.

కార్న్‌ఫ్లేక్స్‌లో ఉండే ఫోలేట్‌ శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు ఉపయోగపడుతున్నట్లు తేలింది. అంతేకాదు, పుట్టుకతో వచ్చే లోపాలు, పెద్దపేగు క్యాన్సర్‌లను నివారిస్తోందీ ఫ్లేక్స్! వీటిలో ఐరన్ అధికమోతాదులో ఉండటంవల్ల రక్తవృద్ధికి సహకరిస్తోందట.
మంచి ఆరోగ్యానికి వీటిలోని నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ‘ఎ’ ‘ఇ’ వంటి విటమిన్లు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా శాకాహారం తీసుకునేవాళ్లు అన్ని విటమిన్లకోసం ఈ ఫ్లేక్స్ ని తినటం మంచిది.

ఇప్పటికీ పలు రకాల ఆహార ఉత్పత్తులతో ఈ సంస్థ ముందంజలో ఉండటం విశేషం.

– యామిజాల జగదీశ్

Also Read : ఆహారం – ఆరోగ్యం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్