Saturday, July 27, 2024
HomeTrending Newsఅస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా యత్నం

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా యత్నం

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అస్సాంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వారి పూర్వ చరిత్ర పరిశీలిస్తే ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ మతోన్మాదాన్ని ప్రచారం చేస్తోందని, యువతీ యవకులకు జిహాద్ వైపు శిక్షణ ఇస్తోందని అస్సాం స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డిజిపి హిరెన్ నాథ్ వెల్లడించారు. మొరిగావ్, బార్పేట జిల్లాలతో పాటు అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వీరి కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని వివరించారు.

బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వలసదారులతో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జనాభా సమతూకం తప్పింది. చాలా నియోజకవర్గాల్లో వలస వచ్చిన ముస్లిం జనాభా పెరిగి పార్టీల గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయికి చేరుకున్నారు. జమ్ముకాశ్మీర్ లో సైన్యం డేగకన్నుతో అక్కడ ఉగ్రవాద కదలికలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ముష్కర మూకలు ఈశాన్య రాష్ట్రాల గుండా భారత్ లోకి చొరబడేందుకు విఫలయత్నం చేస్తున్నాయి.

ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.

ఆల్ ఖైదా, అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్నాయని అస్సాంలోని మోరిగావ్, బార్పేట, గౌహతి, గోల్ పురా జిల్లాల నుంచి వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసులు తెలిపారు. గురువారం వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముస్తపా అలియాస్ ముఫ్తీ ముస్తాఫా మోరిగావ్ జిల్లాలోని సహారియా గావ్ నివాసి.. ఇతడు అన్సరుల్లా బంగ్లా టీంలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇతను మదరసాలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ.. నిధులు సమకూరుస్తున్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఇతనితో పాటు అఫ్సరుల్లా భుయాన్, అబ్బాస్ అలీ, మోహబూబుర్ రెహమాన్, జుబైర్ ఖాన్ , రఫీకుల్ ఇస్లాం , దేవాన్ హమీదుల్ ఇస్లాం , మొయినుల్ హక్ , కాజీబుర్ హుస్సేన్, ముజిబౌర్ రెహమాన్, షాహనూర్ అస్లాం, సహజహాన్ అలీని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దాడుల్లో నిందితుల వద్ద నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, నేరారోపణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరి నుంచి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. కేంద్ర నిఘా ఏజెన్సీలు, అస్సాం పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్ర మాడ్యుల్ బయటపడిందని స్పెషన్ డీజీపీ జీపీ సింగ్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్