Saturday, March 15, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇది కదా మధ్యవర్తిత్వ పరిష్కారమంటే!

ఇది కదా మధ్యవర్తిత్వ పరిష్కారమంటే!

హైదరాబాద్ బంజారాహిల్స్. ఉద్యోగ పక్షులు రెక్కలు కట్టుకుని, లంచ్ బాక్సులు కట్టుకుని బైకుల్లో, కార్లలో, ఆటోల్లో, రాపిడో బైకుల్లో వెళ్ళే వేళ. ఆఫీస్ లో నా సీటు పక్కన పెద్ద కిటికీలో నుండి కనపడే పచ్చటి చెట్టును, వీధిని చూడడంలో నాకు ఏదో ఆనందం ఉంటుంది. పక్కింటివారి చెట్టు కొమ్మ నా కిటికీ ముందు వాలి…ఎర్రటి, తెల్లటి పూలగుత్తులతో ఏదో పూలబాస మాట్లాడుతున్నట్లు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. పచ్చటి కొమ్మలు, ఊగే పూలకొమ్మలతో కిటికీ అద్దం అవతల ప్రకృతి గీచిన చిత్రమేదో చిత్రంగా కదులుతున్నట్లు ఉంటుంది.

అలాంటి కిటికీలో మొన్న ఒక దృశ్యం “దృశ్యం” సినిమాలోలా వెంటపడింది. కిటికీ అద్దాలు మూసుకున్నా శబ్దం వెంటపడింది.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

కాలనీలో రౌడీలుగా తమకు తామే భుజకీర్తులు తగిలుంచుకున్న కొందరు యువకులు రాత్రి తాగినప్పుడు మాటా మాటా పెరిగి మొహాలు పచ్చడయ్యేలా కొట్టుకున్న నేపథ్యంలో మరుసటి రోజు ఉదయం జరుగుతున్న పంచాయతీ అది. బయటి కాలనీవారికి- లోకల్ కాలనీవారికి సరిహద్దు తగాదా అనుకున్నాను మొదట. ఇరవై ఏళ్ళుగా అక్కడ ఉంటున్నవాడిని కాబట్టి అందరూ లోకలే అని ఇట్టే అర్థమైపోయింది. రెండు మతాల మధ్య గొడవేమో అనుకుంటే…అదీ కాదు. అందరూ బొట్లు పెట్టుకునే ఉన్నారు. అందులో ఏటా మా కాలనీలో వినాయకుడిని పెట్టినప్పుడు నేను ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసి గుంపుతో వచ్చి మర్యాదగా వసూలు చేసుకుని…నాకు అతులిత పుణ్యాన్ని ప్రసాదించి…వెళ్ళిపోయే భక్తితత్పరులు కూడా ఉన్నారు.

మా అమ్మానాన్న నన్ను బాగా పిరికిగా పెంచడంతో ఎక్కడైనా ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఉంటే చూడ్డానికి కూడా భయంగా ఉంటుంది నాకు. ఒకరు ఇద్దరయ్యారు. ఇద్దరు నలుగురయ్యారు. ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ “ఏయ్! ఈడున్నా…జల్దీ వచ్చేయ్!” అని వారి వారి అనుచరులను పిలుచుకుంటున్నారు. నలుగురు నలభై మంది అయ్యారు. అందులో సెటిల్మెంట్ చేసే రౌడీని మాత్రం ఇరు పక్షాలు గౌరవంగా చూస్తున్నాయి. అతను ఖద్దరు డ్రస్ లో ఉన్నాడు. రాజకీయం అతడిని ఆశ్రయించి ఉందేమో! నాకు స్పష్టత లేదు. ఎవరి చేతుల్లో తల్వార్లు, తుపాకులు లేవు కానీ…వాతావరణం క్షణక్షణానికి వేడెక్కుతోంది.

నా సీటు పక్కన చేతికి అందేలా తెలుగు, సంస్కృతం నిఘంటువులు శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువులు, విద్యార్థి కల్పతరువు, తెలుగు పర్యాయపద నిఘంటువు, అమరకోశం, వైజయంతి…ఇలా ఎన్నో పెట్టుకున్నాను. అవేవీ అందుకోలేని భాష మొదలయ్యింది. అంతకుముందే ఇంట్లో అచ్చ తెలుగులో ఆంజనేయదండకం చదువుకుని వెళ్ళాను. అయినా ఆ మాటలకే గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. తెలుగు బూతు పదకోశం తయారుచేయడానికి కావాల్సినన్ని మాటలు విన్నాను. మరికొద్ది క్షణాల్లో కొన్ని మెడలు తెగడం ఖాయం…బాధ్యతగల పౌరుడిగా ఈ మారణహోమాన్ని ఎలాగైనా ఆపాలి…పోలీసు హండ్రెడ్ కు డయల్ చేద్దామనుకుని…మా ఆఫీస్ సిబ్బందిని ఏమిటి ఈ గొడవ అని అకెడెమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ అడిగాను. (ఇలాగే ఒకసారి మిట్ట మధ్యాహ్నం కొందరు యువకులు తాపీగా రోడ్డుమీద తెల్ల పొడులు పీలుస్తుంటే…రహస్యంగా ఫోటోలు తీసి పోలీసులకు పంపితే..సార్! మీరు చదువుకున్నవారిలా ఉన్నారు…మీరు ఫిర్యాదు చేసినట్లు వాళ్ళకు తెలిస్తే…మిమ్మల్ను దేవుడు కూడా రక్షించలేడు! అనే అర్థం వచ్చేలా- చదువుకున్నవాడిలా ఉన్న ఆ పోలీసు నా చదువుకు అర్థం లేదని స్పష్టత ఇచ్చి…నన్ను రక్షించిన అనుభవం కూడా ఉంది!) మా ఆఫీస్ అతడు నాలా పిరికివాడు కాదు కాబట్టి…చూసొస్తాను సార్ అని…వారిమధ్యకు వెళ్ళి తాపీగా నిలుచున్నాడు. మధ్యలో ఇతడి మెడ తెగితే…నా మెడకు చుట్టుకుంటుందని మరింత వణికిపోయాను.

అయితే ఈ గొడవలో ఎక్కడా రక్తం చిందలేదు. కత్తి పోట్లు లేవు. కనీసం కొట్టుకోలేదు. బూతులు, పచ్చి బూతులు, పచ్చి పచ్చి పిచ్చి బూతులు, తిట్లు, శాపనార్థాలు, సవాళ్ళు, హెచ్చరికలు, కాలర్ పట్టుకోవడాలు, తోసుకోవడాల దగ్గరే ఆగేలా హ్యాండిల్ చేసిన ఆ రౌడీ సెటిల్మెంట్ నాకు తెగ నచ్చింది. బహుశా ఈ రంగంలో అతడికి విస్తృతానుభవం, గౌరవ మర్యాదలు ఉన్నట్లున్నాయి. రెండు వైపులా ఎంత మొరటోడైనా అతడిదగ్గరికి వచ్చేసరికి వంగి వినయంగా నమస్కారం పెట్టి పక్కకు వెళ్లిపోతున్నారు. ఏ రంగంలో అయినా ఆ స్థాయికి రావడానికి ఎంతో కృషి అవసరం.

“తాగినప్పుడు ఇట్లనే మజాక్ చేస్తార్రా బై…దానికే కొట్టాలా?” అని అతడు తీర్పు చెబుతూ అన్న మాట నా గుండెను తాకింది. భారతంలో ధర్మం, ధర్మ సూక్ష్మం మధ్య ధర్మరాజే తడబడుతుంటే జగద్గురువు కృష్ణుడు అనేక సందర్భాల్లో కలుగజేసుకుని క్లారిటీ ఇచ్చాడు. నిజమే కదా? తాగినప్పుడు లక్ష అనుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, చంపుకుంటారు. తాగనప్పుడు అంటే లెక్క కానీ…తాగినప్పుడు అన్న మాటకు ఒకే కాలనీలో రోజూ కలిసి తిరిగే యువకులు మొహం పచ్చడి అయ్యేలా కొట్టుకోవడం ఏమిటి?

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

న్యాయస్థానాల్లో విచారణకు సమయం దొరక్క కొన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలే ప్రోత్సహిస్తున్నాయి. పరస్పరం కత్తులు దూసుకునే నలుగురినీ ఎదురెదురుగా నడి రోడ్డుమీదే నిలుచోబెట్టి…వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన ఈ మధ్యవర్తిత్వ దృశ్యాన్ని జస్టిస్ ఎన్ వీ రమణ కనుక చూసి ఉంటే…తను కోరుకున్న స్వప్నం సాకారమయ్యిందని అచ్చ తెలుగులో ఆనందించేవారు.

కోరుకుని పెట్టించుకున్న పెద్ద కిటికీ అది. ఆ పి వి సి విండో సౌండ్ ప్రూఫ్, ఎయిర్ టైట్, హీట్, ఫైర్ రెసిస్టెంట్ గ్లాస్ అని ఏదేదో ఊదరగొట్టాడు ఇంటీరియర్ అతను. గ్లాసులన్నీ మూసినా చెవుల్లో రక్తం కారేలా తెలుగులో ఉన్న బూతులన్నీ వినాల్సి వచ్చింది ఒక్క గంటలో. లేక…ఇంటీరియర్ అతను సౌండ్ ప్రూఫ్ గట్టివే వేసినా…వాటికి ఈ రౌడీల శబ్దగాంభీర్యాన్ని, శ్రుతి తీవ్రతను తట్టుకునే శక్తి ప్రకృతిసిద్ధంగా సహజంగా ఉండకపోవచ్చు! నా బిల్డింగ్ కు ఇన్సూరెన్స్ ఉంది. ధర్మ సూక్ష్మం ప్రకారం ఇలాంటి నష్టానికి కూడా ఇన్సూరెన్స్ వర్తించాలి కదా!

“తాగినప్పుడు లక్ష అనుకుంటాం…” అన్న ఒక్క మాటతో పేరుమోసిన రౌడీలందరి నోరు మూయించిన, చేతులు కట్టేసిన ఆ రౌడీ పెద్దలో ఏదో ప్రత్యేక లక్షణం కనిపించింది నాకు. పరస్పరం అంతు తేల్చుకోవడానికి జబ్బలు చరుచుకుంటూ…తొడలు కొట్టుకుంటూ వచ్చినవారు “తాగినప్పుడు చేసేవాటికి తాగనప్పుడు పంచాయతీ పెట్టకూడ”దన్న అనంతమైన ధర్మసూక్ష్మ జ్ఞానం కలిగి తల వంచుకుని వెళ్ళిపోయిన సంస్కారం, వినయం, విధేయత, బాధ్యతాయుత ప్రవర్తన, పరివర్తన కూడా చిన్నవి కావు! వేనోళ్ళ పొగడదగ్గవి!

వారికేమి?
తాగి తన్నుకుని…తాగి సెటిల్ చేసుకోగలరు!
మరి మనం?
తాగితే మరచిపోగలం…కానీ తాగనివ్వదు!
మరచిపోతే తాగగలం…కానీ మరువనివ్వదు!

మనిషి బతుకింతే!
మనసు గతి ఇంతే!
మనసున్న మనిషికి సుఖము లేదంతే!!

కొస మెరుపు:-
ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి…అంతా ప్రశాంతంగా ఉందనుకుంటూ కిటికీ అద్దం తెరవబోతుంటే…మా ఆఫీస్ అతను వచ్చి…“వాళ్ళందరూ మీకు బాగా తెలిసినవాళ్ళే సార్” అని నా నెత్తిన హిరోషిమా నాగసాకి సైజు బాంబు వేశాడు! ఎవరి పరిశీలన, అవగాహన వారిది! పూర్వాశ్రమంలోనో, పూర్వజన్మలోనో నాకు తెలియని నా చరిత్ర ఏదో లోకానికి తెలిసి ఉండాలి!

ఒక నగరంలో నాలుగు వీధులున్న ఒక కాలనీలో ఇందరు పేరుమోసిన, పేరు మోయబోయే రౌడీలున్నారా?
పైగా వారందరితో నాకు వ్యక్తిగతంగా ఇంత గాఢమైన పరిచయం ఉందా?
హతవిధీ! ఇంతకూ నేనెవరిని?
కోహం!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్