Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతిలాపాపం తలా పిడికెడు

తిలాపాపం తలా పిడికెడు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పెద్ద చర్చ నడుస్తోంది. విద్యార్థులు, సామాన్యులు, సెలెబ్రిటీలుగా చెప్పుకుంటున్న వారు, ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నారు. అది అటవీ భూమి కాదు, ప్రభుత్వ భూమే అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఎన్నో జంతువులూ, చెట్లు ఉన్న ప్రాంతం అనీ, ఆ భూముల్ని అలాగే ఉండనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెమళ్ళు, జింకలు ఉన్న AI బొమ్మలను విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేస్తోందని పోస్టులు పెడుతున్నారు.

పచ్చని చెట్లను కొట్టేసి నిర్మించిన ఆకాశ హర్మ్యాలను చూసిన ఒక అంతర్జాతీయ కంపెనీ సీఈఓ ‘అద్భుతం, హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయి’ అన్నాడని మనం ఆనందించినపుడు; పెద్ద పెద్ద కొండలు పిండి చేసి కట్టిన ఆఫీసుల్లో మన అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందని మురిసిపోయినప్పుడు; అప్పుడెప్పుడో రాళ్ళూ రప్పల మధ్య కొన్నప్లాట్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా ‘డెవలప్’ అయ్యిందని, దాని విలువ ఇప్పుడు ఎన్నో రేట్లు పెరిగిందని, అది తన ఘనతే అని గొప్పలు చెప్పుకున్నప్పుడు- ఇవన్నీ గుర్తు రాలేదా?

మనస్తత్వ శాస్త్రంలో “మోరల్ హిపోక్రసి” అనే భావన ఒకటి ఉంటుంది. దాని ప్రకారం- ఒక వ్యక్తి తన పక్కన వారు, చుట్టూ ఉన్నవారు మాత్రం ఉన్నతంగా, నైతికంగా ప్రవర్తించాలని కోరుకుంటాడు కానీ…తన వద్దకు వచ్చేసరికి ఆ నియమాలు, నైతిక విలువలు నిలబడవు. ఈ వ్యవహారంలో గొంతెత్తున్నవారు తమను తాము ఈ విషయమై ప్రశ్నించుకోవాలి.

హైదరాబాద్ లో ఒక జోక్ వినిపిస్తూ ఉంటుంది: మీరు కొత్త వారిని ఎవరినన్నా కలసినప్పుడు- మీరేమి చేస్తుంటారని ఎవరినైనా అడగకూడదు అట! రియల్ ఎస్టేట్ కాకుండా మీరు ఇంకా ఏమి చేస్తారు? అని అడగాలట! అవును మరి…అలా రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరిలో మేకమయిపోయింది. దీనికి ముఖ్యంగా మూడుకారణాలు కనపడతాయి.

మొదటిది:-
పెట్టుబడిదారీ విధానం ప్రపంచాన్ని కబళించి చాలా సంవత్సరాలు అయ్యింది. మన కుటుంబ ఆదాయం అయినా…వ్యక్తిగత జీతాలు, ఆస్తులు అయినా…దేశ జీడీపీ అయినా…స్టాక్ మార్కెట్ అయినా…కంపెనీల ఫలితాలు అయినా…అన్నిటిలో మనకు కావాల్సిన, అందరూ జపిస్తున్న ఒకే ఒక పదం ‘గ్రోత్’-అంటే పెరుగుదల. పెరుగుదల లేకపోతే మనుగడ లేదు అని మేనేజ్మెంట్ నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. మనుగడ ఉండాలంటే- డైనమిక్ గా ఉండాలి; అందరి కన్నా ముందు ఉండాలి; కొత్తగా అలోచించి వినియోగదారులని ఆకర్షించాలి…ఇంకా ఇలాంటివే మనం మనం పిల్లలకు కూడా నూరి పోస్తూ ఉంటాం.

రెండవది:-
ప్రపంచ వ్యాప్తంగా అర్బన్ మైగ్రేషన్ విస్తారంగా జరుగుతోంది. భారత్ దేశంలాంటి అభివృద్ధి చెందే దేశంలో మరింత విస్తృతంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ లాంటి నగరం మరింతగా కొత్తవారిని అక్కున చేర్చుకుంటూ ఉంటుంది. 2050 నాటికి మరి ఎంతగా గృహనిర్మాణం జరిగితే అందరికీ ఇల్లు, స్థలాలు దొరుకుతాయి? ఇంత మంది ఒకే ప్రదేశంలో ఉంటే ఎంత స్థాయిలో వనరులకై పోటీ ఉంటుంది? అందుకే ఈ రంగంపైనే ఇంత మందికి ఆసక్తి.

మూడవది:-
ఇంత పట్టణీకరణ జరుగుతున్నా… ఇంత జనాభా పెరుగుతున్నా…మన వనరుల, సంపద పైన ఇంత పోటీ తత్వమున్నా…మన దేశంలో సరైన చట్టాలు, ప్రణాళికలు ఉన్నాయా? చట్టాల్లో లొసుగులు లేకుండా ఉన్నాయా? రాజకీయాలు, వ్యాపారాలు కలిసి పోకుండా ఉన్నాయా? నైతిక విలువల పరిరక్షణ ఉన్నదా?

ఈ మూడింటిని కలిపి చూస్తే అర్థమవుతుంది ఎందుకు ప్రజలకు రియల్ ఎస్టేట్ పైన అంత ప్రేమో. డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ సంపద పెరిగే అవకాశం ఉంది. చట్టాలు గట్టివి కాదు కాబట్టి అడ్డదారులు తొక్కితే మరింత డబ్బులు చేసుకొనే అవకాశం సులభంగా ఉంది. ఎంత వరకు అవకాశం ఉంటే అంత “డీవియేషన్” చేసి ఎంత ఎక్కువ విస్తీర్ణంలో అవకాశం ఉంటె అంత కట్టాలి. “సెట్ బ్యాక్” ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వదిలిపెట్టాలి. చట్టపరంగా ఎన్ని అంతస్తులు అనుమతి ఇచ్చినా… దానికన్నా మరింత ఎక్కువగా వేయాలి. ఇలా ఆలోచించని వారు ఎంత మంది మనలో? నూటికి పది మంది ఉంటారా?

అంత ఎందుకు – న్యాయబద్ధంగా, నీతిగా ఉండి, పర్యావరణ హితుడు అయిన ఒక వ్యక్తి తన స్థలంలో చెట్లు ఉంటే వాటిని కొట్టకుండా ఇల్లు కట్టగలరా? అభివృద్ధి చెందిన ప్రాంతంలో మీకు వ్యవసాయ భూమి ఉంటే…దానిని నాలా(NALA)చేసి, ఆ పచ్చని చేలని ప్లాట్స్ గా చేసి అమ్ముకోకుండా ఉండగలమా? హైదరాబాద్లో శివార్లలో ఎన్నో నెమళ్ళు, ముంగీసలు తిరుగున్న చేలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరం అయ్యాయి. కొన్ని వేల ఏళ్ళ పరిణామక్రమానికి సాక్ష్యం అయిన కొండలు పిండి అయ్యి… ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. ఇక కుంటలు, చెరువుల, నాలాల ఆక్రమణ చెప్పాల్సిన పనే లేదు. ప్రజలు, ప్రభుత్వం అనే తేడా లేకుండా అభివృద్ధి పేరుతో మనం అందరం భాగస్వాములుగా మన ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వసం చేసుకుంటూ వెళ్తున్నాం. నిజంగా కళ్ళు తెరిస్తే…వీటన్నిటి పైన ఒక విస్తృతమైన చర్చ జరగాలి.

పర్యావరణమే ప్రధానంగా, కేంద్రంగా చట్టాలు రూపొందించాలి. అటువంటి చట్టాలు లేనంతవరకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ప్రభుత్వం చేస్తున్నది తప్పుకాదు. సాధారణ ప్రజల లాగానే నేటి ప్రభుత్వం కూడా సంపద పెంచే మార్గంలోనే నడుస్తుంది. ప్రభుత్వాలు కూడా మన లాగానే భూములు అమ్మి సొమ్ము చేసుకోవటం ఎప్పటి నుండో ఉన్న రివాజు. అడవి కాదు కాబట్టి ఖాళీ స్థలాన్నిచదును చేసి అమ్ముకోవాలని అనుకున్నది. ఎంత పాత చెట్లు ఉన్నా పీకి, ఎంత పెద్ద కొండలు ఉన్నా పిప్పి చేసి, ఆకాశ హర్మ్యాలు కట్టి సంపద పెంచుకోవాలనే తపన ఉన్న మన లాగానే ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. మరి మనకెందుకు ఇంత హిపోక్రసీ?

-వాసిరెడ్డి విక్రాంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్