Visa Frauds: కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి అన్నది మన దివంగత మాజీ రాష్ట్రపతి.. ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మాట. కానీ, తమ కలలను అడ్డదారులైనా తొక్కి నిజం చేసుకుందామనుకుంటే… ఏం జరుగుతుందో చెప్పడానికి ఇటీవల ఢిల్లీలో అడ్డంగా దొరికిన తెలుగు విద్యార్థుల కథ ఓ ఉదాహరణ. నమ్మకంపైనే ప్రపంచం ఆధారపడి ఉంది. అయితే మోసానికీ, వెన్నుపోట్లకూ ఆ నమ్మకమే మళ్లీ ఆధారం కూడాను!
అయితే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సైతున్నారన్నదే ఇప్పుడు అర్థంగాని ప్రశ్న..? తెల్లార్లేస్తే పడుకునేవరకూ పోటీ ప్రపంచంలో విహరించే యువతకు… అందులోనూ కాస్తోకూస్తో సాఫ్ట్ వేర్ చదువులు చదువుకున్న యువతకు విదేశాలకు వెళ్లడం ఓ కల. అందులోనూ యూఎస్ ప్రయాణం…అక్కడికెళ్లాకెలా ఉంటుంది… అందరికీ బానే ఉంటుందా అన్నది కాస్సేపు పక్కనబెడితే… వెళ్లేవరకూ అదో ఉత్కంఠ! అలా అని వెళ్లేవరకూ ఉన్న ఉత్కంఠభరితమైన అనుభూతిని… అక్కడికి వెళ్లిన వారందరూ అంతే ఆనందంగా ఆస్వాదించే పరిస్థితులుండకపోవచ్చు! కొన్నిసార్లు బూమరంగ్ కావచ్చు!!
ఎంత చదువుకున్నవాడైనా… బలహీనతలు సహజం. ఆ బలహీనతలే మోసాలకు పాల్పడేవారి బలం. విద్యార్థుల వీసా విషయాల్లో అమెరికా నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరిస్తుందని తెలిసే.. శతకోటి దరిద్రాలతో అనంత కోటి ఉపాయాలకు ప్రయత్నించడం సరైనదేనా? దేశంకాని దేశానికి వెళ్తున్నప్పుడు ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా అన్నది మాత్రం ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న? ఏజెంట్ల వీసా మోసాలపై నిత్యం వార్తల్లో, సోషల్ మీడియాలో పోటెత్తుతూనే ఉన్నా… అమెరికా యాత్రాకాంక్ష ముందు కనిపించకపోవడం కళ్లుండీ చూడలేని గుడ్డితనమే కాదు… అత్యాశ ముదిరిన పిచ్చితనం కూడాను!
అదిగో అలాంటి బాగోతమే ఢిల్లీ కేంద్రంగా బయటపడింది. నకిలీ వీసాలతో… నకిలీ అనుభవపు సర్టిఫికెట్లతో… ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయానికే ఏకంగా అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. చాణక్యపురి పోలీసులు 12 మంది తెలుగువాళ్లను పట్టుకున్నారన్న వార్త ఎంత అవమానకరం..? అమెరికాకేగి పై చదువులు చదివి… మావాడు ఫలానా అని పేరెంట్స్ చెప్పుకోవడం సంగతి తర్వాత సంగతి, ముందు ఇలాంటి అవమానభారం నుంచి బయటపడేదెలా? పైగా కఠినమైన నిబంధనలతో సాగే వీసా జారీ ప్రక్రియలో పట్టుబడ్డందుకు అనుభవించే శిక్ష సంగతేంటి?
డబ్బు పాయె… పరువు పాయె… అమెరికా ప్రయాణపు ఆశలు గల్లంతాయె… నిజం చేసుకోవాల్సిన కలలను అడ్డదారిన సాకారం చేసుకోవాలనుకున్నందుకు.. మొత్తంగా భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి వచ్చె! ఏజెంట్లనూ, కన్సల్టెంట్లనూ… విద్యార్థులనూ అంతా కలిసి 27 మందిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీస్… ఊరికే వదిలేస్తుందా…? ఏజెంట్లు, కన్సల్టెంట్లంటే దొరికితే దొంగ.. లేకుంటే దొరల్లా వాళ్ల పనులు వాళ్లు చేసుకుపోతూనే ఉంటారు. దొరికినా వారికుండే పలుకుబడో, పైరవీలతోనో మళ్లీ ఎలాగోలా బెయిల్ పై బయటకొచ్చి… తెల్లార్లేస్తే మళ్లీ అదే దందానూ కొనసాగించే సాహసవంతులు వాళ్లు. కానీ… మన తెలుగు విద్యార్థుల పరిస్థితి…?
అయినవాడే పట్టించుకోని రోజుల్లో… ఎక్కడో కానివాడి వద్దకు అదీ అక్రమమార్గంలో అమెరికా ప్రయాణం కోసం వెళ్లితే… వాడు డబ్బులు గుంజే అవకాశముండీ.. దిశానిర్దేశం చేస్తాడా..? అడ్డదారుల్లోనే ప్రోత్సహిస్తాడు. అలాగే చేశారు. గుంటూరులోని ఓ బ్యాంక్ నుంచి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరైనట్టు పత్రాలు సృష్టించి… హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానుభవ నకిలీ సర్టిఫికెట్ నూ క్రియేట్ చేసి… పైగా ఆంధ్రప్రదేశ్ కు చెందినవాళ్లకు అటు చెన్నై, ఇటు హైదరాబాద్ ఉండగా ఢిల్లీలో అప్లై చేయిస్తే… నిత్యం ఎందరికో వీసాలు మంజూరు చేస్తూ… అవసరం లేదనుకుంటే రిజెక్ట్ చేసేవాళ్లకు ఆ మాత్రం అనుమానం రాదనుకోవడం.. తెలివిదక్కువ తనమా…? లేక, తామే తెలివిమంతులమనుకునే తెలివిమీరిన తనమా…?
అందుకే ఆశకు హద్దుండాలి. అమెరికాను అందుకునే యత్నంలో… ఆ అనుభవం లేకున్నా… అక్కడ చదువుకునే స్థోమత లేకున్నా… నకిలీలలతో నెట్టుకొస్తామంటే… నూటికొక్కడికో.. పదిమందికో… ఆయా సమయాల్లో ఎంబసీల్లోని అధికారుల మూడ్స్ ని బట్టి అది చెల్లుబాటవుతుందేమోగానీ… ఎప్పుడూ అందరికీ అలానే జరగాలని ఏమీ ఉండదన్నది.. ఇదిగో అమెరికా పేరిట కోర్ట్ బోన్ ముందు నిలబడబోతున్న మన తెలుగు విద్యార్థుల కథ చెబుతోంది.
-రమణ కొంటికర్ల
Also Read :