కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో సుభాష్ చంద్రబోస్ సంకల్పమాత్రం చేత దిక్కుల దీపాలు వెలిగించగలిగాడు. ఆయన అడుగులకు దూరాలు దారి మార్చుకుని దాసోహమన్నాయి. ఆయన మాట రణన్నినాదమై దశదిశలు ఊగిపోయాయి. ఆయన వ్యూహంలో రవి అస్తమించని బ్రిటీషు సేనల సమూహాలు పూటకు మూడు చెరువుల నీళ్ళు తాగాయి. స్వేచ్ఛ కోసం గళమెత్తిన క్షణం నుంచి, తుదిశ్వాస దాకా అడుగడుగునా అగ్నిపరీక్షలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందడుగు వేసిన నేతాజీ బాట మనం పాడుకుంటున్న స్వాతంత్య్రం పాట.
కలకత్తా ఎక్కడ? ఢిల్లీ, కాబుల్, మాస్కో, బెర్లిన్, సింగపూర్, టోక్యోలమీదుగా ఇంఫాల్ కు దారెక్కడ? బ్రిటీషు సేనలు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాచేవేళ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టగలరు. అలాంటిది గృహ నిర్బంధం నుంచి మారువేషంలో బోస్ తప్పించుకుని దేశం కాని దేశంలో తలదాచుకున్నది ఏమీ తోచకనా? లేక రేప్పొద్దున భారతీయుడు లాంటి సినిమాకు కమర్షియల్ సబ్జెక్టు దొరుకుతుందనా? అనుకున్నది సాధించడం కోసం జర్మనీ, రష్యా, జపాన్ సాయం కోరాడు. ఒకరు సరేనంటే…ఒకరు పెదవి విరిచారు. అయినా సంకల్పం గట్టిదైతే సాహసమే ఆయుధమవుతుందని నిరూపించాడు. జపాన్ సేనల సహాయంతో సరిహద్దుల్లో 1943లోనే స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించగలిగాడంటే ఆ గుండె ఎంత ధైర్యమైనది కావాలి? ఇంఫాల్ మీదుగా బ్రిటీషు సేనలను ఆక్రమించాలని వ్యూహం పన్ని ఫౌజ్ అడుగులు వేసే సమయంలో ఆ పాదాలకు ఎంత బలం కావాలి? దేశం కాని దేశంలో ఒకరా ఇద్దరా వేనవేల మందికి సాయుధ శిక్షణ ఇవ్వాలంటే ఎంత కష్టం? ప్రకృతి ప్రకోపించడం, రెండో ప్రపంచ యుద్ధం హిరోషిమా మీద బాంబు పడి ముగియడం, జపాన్ ఓడిపోవడంతో తన సేనలు నీరుగారిపోయాయి కానీ లేదంటే నేతాజీ చేతిలో నాలుగేళ్ళ ముందే స్వాతంత్ర్యం వచ్చేదేమో? ఏమో! ఇది చరిత్ర తిరగని మలుపు.
బోసు 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్ లో పుట్టాడు. 1945 ఆగస్టు 18న రష్యా సహాయం అర్థించడానికి వెళ్తూ తైవాన్ వద్ద విమాన ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదంలో గాయపడ్డాడే కానీ మరణించలేదని చనిపోయేదాకా అంటూ వచ్చిన ఆయన సహచరుడు చివరి క్షణంలో ప్రమాదంలోనే బోసు మరంచాడని ఎందుకన్నాడో? ఆయన అస్థికలు జపాన్ లో ఉన్నాయి. వాటిని భారత్ కు తెప్పించేంత తీరికా ఓపికా మన ప్రభుత్వాలకు లేదు. ప్రమాదం నుంచి బయటపడి బ్రిటీషు వారికి దొరకకుండా చాలాకాలంపాటు హిమాలయాల్లో ప్రశాంత జీవనం గడిపాడని బెంగాలీలకు ఇప్పటికీ బలమైన నమ్మకం.
అప్పట్లో ఇండియన్ సివిల్ సర్వీసు (ఐ.సి.ఎస్.) అంటే అనితర సాధ్యమైంది. అది పాసై ఇంగ్లండ్ లో ఉద్యోగం చేస్తుండిన బోసు ఆగర్భ శ్రీమంతుడు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో మనసు ద్రవించి, స్వరాజ్యకాంక్ష గుండెల్లో గూడు కట్టుకుని ఉద్యోగం వదలి స్వదేశం వచ్చాడు. అప్పటికే గాంధీ ఒక స్వతంత్ర రూపం. ఆయన బాటలోనే నడుస్తూ ఆ బాటనే తప్పుపట్టాడు. గమ్యం ఒకటే అయినా గమనం నచ్చక జాతిపితతో విభేదించినా అది సైద్ధాంతికమైన వ్యతిరేకతే కానీ వ్యక్తిగతం కాదు. అమ్మా! అయ్యా! అని అర్థిస్తే కాదు కదన కుతూహలంతో బ్రిటీషు వారి కళ్ళు తిరిగేలా పావులు కదపాలన్నది ఆయన సిద్ధాంతం. విభేదాలు ఉన్నా 1938లో బోసును జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ ప్రతిష్ఠించడంతో ఆశ్చర్యపోయారు. రెండోసారి నేతాజీ ఎన్నిక కావడం గాంధీకి ఇష్టం లేదు. భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఆ పదవికి గాంధీ నిలబెట్టారు. అయితే ఆయన మీద అత్యధిక వోట్ల తేడాతో నేతాజీ గెలవడంతో ‘భోగరాజు ఓటమి నా వ్యక్తిగత ఓటమి’ అని గాంధీ ప్రకటించారు. పెద్ద నాయకులిద్దరి మధ్య దీంతో వైరుధ్యాలు పెరిగిపోయాయి. బోసు స్వరాజ్య పార్టీ స్థాపించడంతో కాంగ్రెస్ అతివాదుల దృష్టి అటు మళ్ళింది. ఆపై ఫార్వర్డు అడుగులతో బోసు ప్రయాణం కాంగ్రెస్ కు పూర్తిగా దూరమైంది.
ఉద్యమాలతో భరతజాతి చైతన్యమైన క్షణంలో చౌరీచౌరా ఘటనను సాకుగా చూపి గాంధీ కాడి వదిలేశారన్నది నేతాజీ విమర్శ. ఎవరి వాదనను వారు సమర్థించుకున్నారు. దారులు వేరయ్యాయి. అయితేనేం! సింగపూర్ నుంచి రేడియోలో నేతాజీ ప్రసంగిస్తుంటే భరతజాతి యావత్తు చైతన్య కీలలుగా మారి నింగికెగసింది. బోసు కృషికి క్విట్ ఇండియా ఉద్యమం మరింతగా ఊపిరులూదింది. ఆయన్ను తీవ్రవాదిగా ముద్రవేసి ఆనందించారు మితవాదులు. మితవాదుల చేతగానితనాన్ని దూది ఏకినట్లు ఏకారు అతివాదులు. చావులో సైతం వెరపెరుగని వీరుడిది స్వతంత్ర పోరాటంలో జ్వలించే అక్షరాలతో రాసిన చలించే చరిత్ర. వందమంది దేశభక్తుల చిత్రాలు కళ్ళ ముందున్నా నేతాజీ చిత్రంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పదధ్వనులు, బతుకొక పోరాటంగా మారిన రూపం, ఆ కళ్ళల్లో స్వతంత్ర భారతిని ఆవిష్కరిస్తున్నానన్న ఆనందం, హిమవన్నగాన్ని తలదన్నే గాంభీర్యం కనిపిస్తూనే ఉంటాయి.
(జనవరి 23 నేతాజీ జయంతి. 1997లో ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురితమైన వ్యాసం నుండి కొంత భాగం స్మరణగా)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు