‘100 పర్సెంట్ లవ్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘గీతగోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ తదితర బ్లాక్ బస్టర్ చిత్రాల్ని నిర్మించిన జీఏ2పిక్చర్స్ తాజాగా ఓ చిత్రాన్ని ప్రారంభించింది. వినూత్నమైన కథల్ని, నూతన దర్శకుల్ని ప్రొత్సహించే క్రమంలో భాగంగా రియలిస్టిక్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా సమర్పకుడిగా కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ఈ సినిమాను జీఏ2పిక్చర్స్ వారు స్వేచ్ఛ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.
యువ నిర్మాత ధీరజ్ మోగిలినేని ఈ సినిమాను నూతన దర్శకుడు ధుశ్యంత్ కటికనేనితో రూపొందిస్తున్నారు. కలర్ ఫొటో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుహాస్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన ఈ సినిమా పూజాకార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరై క్లాప్ కొట్టారు. అనంతరం దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేశారు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర నిర్మాత ధీజర్ మోగిలినేని తెలిపారు.