ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా జరగదు కదా! ఎవరో ఒకరు జరిపించాలి. న్యాయమూర్తులే ఆ పని చేస్తుంటారు. తమముందు విచారణకు వచ్చే విడాకులు, భరణాల వివాదాల్లో విడిపోయేప్పుడు వచ్చే సమస్యలను ఎన్నిటినో చూసి ఉంటారు.
ఒక పెద్ద మనిషికి భారత ఆదాయప్పన్ను శాఖవారి లెక్కలప్రకారం అయిదున్నరవేల కోట్ల సంపద ఉంది. మొదట ఒక పెళ్ళయ్యింది. కొంతకాలం కాపురం చేశాక మనస్పర్ధలొచ్చాయి. పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టుద్వారా లీగల్ గా విడిపోయారు. ఆ సందర్భంగా భరణంగా మాజీ భార్యకు మాజీ భర్త 500 కోట్లు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. ఇంత సంపద ఉన్నా ఏదో వెలితి అని…మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కర్మ ఎందుకో బలంగా కాలి…రెండో పెళ్ళిలో వేసిన మూడు ముళ్ళు కూడా గట్టిగా నిలబడక వదులుగా జారిపోయాయి. పూర్వానుభవం ఎలాగూ ఉంది కాబట్టి…అలాగే పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టుద్వారా లీగల్ గా విడిపోదాం అన్నాడు. ఆమె అడ్డం తిరిగింది. మొదటామె అమాయకురాలు కాబట్టి నీ 5,500 కోట్లలో 500 కోట్లు భరణంగా ఇస్తే సరేనని మౌనంగా తలవంచుకుని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టింది…నేనలా కాదు…అర్ధాంగిగా నాకు నీ ఆస్తిలో అర్ధభాగం అంటే 2,750కోట్లు ఇస్తేనే సంతకం పెడతాను అని పేచీ పెట్టింది. స్థానిక కోర్టు, హై కోర్టు దాటి కేసు సుప్రీం కోర్టు దాకా తెగ తీగసాగింది.
ఈ కేసు విన్న న్యాయమూర్తులకు చిర్రెత్తుకొచ్చింది. ఈమధ్య చాలామంది మహిళలు భరణంగా ఇలాగే సగం లెక్కలు వేసి అడుగుతున్న విషయం గుర్తొచ్చింది. ప్రత్యేకించి ఈ కేసులో మొదటామెకు ఇచ్చినట్లు 500కోట్లు అడిగినా బహుశా న్యాయమూర్తులు ఇంత ఇదయి ఉండేవారు కాదేమో! 2,750కోట్ల భరణమా! ఏం వేళాకోళంగా ఉందా? వేల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? అడగడానికయినా ఒక హద్దుండద్దా! అని క్లాసు తీసుకున్నారు.
విడిపోయిన తరువాత తనమానాన తను గౌరవంగా, ఆర్థికంగా ఇబ్బందిపడకుండా సహేతుకమైన జీవనప్రమాణంతో బతకడానికి ఇచ్చేదే భరణం కానీ…మాజీ జీవిత భాగస్వామితో సమానంగా ఆర్థిక స్థితి కల్పించడం కాదని సర్వోన్నత న్యాయమూర్తులు కుండ బద్దలుకొట్టినట్లు స్పష్టంగా చెప్పారు.
ఆమెకు భరణంగా 12 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని తీర్పునిస్తూ…అతడిపై ఆమె పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను కూడా కొట్టేశారు. (ఆమె కోర్టుకెక్కకపోయి ఉంటే 500కోట్లు వచ్చేవేమో పెరుమాళ్ళకే ఎరుక!)
విడాకుల తరువాత మాజీ భర్త దివాలా తీస్తే…మాజీ భార్య పెద్ద మనసుతో ఏమన్నా పదిపైసలు ఇస్తుందా? అని కూడా ప్రశ్నించారు. మాజీ భర్త ప్రస్తుత ఆర్థిక స్థితి దృష్ట్యా మాజీ భార్యకు జీవితాంతం భరణాన్ని లెక్కకట్టాల్సిన పనిలేదన్నారు. వివాహం కుటుంబానికి పునాదే తప్ప, కమర్షియల్ వెంచర్ కాదని బల్లగుద్ది మరీ చెప్పారు.
పెళ్ళి మంత్రాల్లో ధర్మేచ…అర్థేచ…అంటే ఆర్థికసంబంధ విషయాలనుకుంటున్నారేమో ఈ మాజీ భార్యలు!
ఎవరి నిఘంటువులు వారివైన ఈ రోజుల్లో ఎవరి అర్థాలు వారివి! అప్పుడప్పుడు సుప్రీం కోర్టు కలుగజేసుకుని ఇదీ అసలు అర్థం అని చెప్తే తప్ప కొన్ని తెలియడం లేదు. కలకాలం భారీ భరణ రుతువే ఉండాలనుకునే కలికాలం!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు