Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంటోల్ గేట్లు శాశ్వతం కాకూడదన్న సుప్రీం కోర్టు

టోల్ గేట్లు శాశ్వతం కాకూడదన్న సుప్రీం కోర్టు

జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో ద్వారం ద్వారా వెళ్ళిపోవాలి. దారి మధ్యలో ఉండాలన్నా జీవితం ఉండనివ్వదు. ఉండిపోవాలనుకోవడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం.

ఆ పురాతన రహదారే ఆధునిక యుగంలో జాతీయ రహదారి అయ్యిందనుకోవాలి! ఈ ఆధునిక రహదారిలో ప్రతి అరవై కిలోమీటర్లకు మన పాపపుణ్యాలను మనకు శాస్త్రీయంగా గుర్తు చేసేవే టోల్ గేట్లు. అందులో మన సంచిత పాప ఫలానికి అంటే అక్యుములేటెడ్ పాపానికి ప్రతిరూపంగా రూపొందినదే ఫాస్ట్ ట్యాగ్.

చిన్నయసూరి రాసిన వ్యాకరణానికి బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు. నిజానికి ఇప్పుడది వృద్ధులకు కూడా జీర్ణం కాని మహా ప్రౌఢ వ్యాకరణం. అందులో సమాస పరిచ్ఛేదం ఒక భాగం. రెండు పదాలు ఒకటిగా ఏర్పడ్డం సమాసం. ఫాస్ట్ ట్యాగ్ రెండూ ఇంగ్లీషు పదాలే అయినా అందులో సమాసం లేకుండా పోదు.
ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్యాగ్;
ఫాస్ట్ గా పంపే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనువయిన ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనుమతించే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే వాహనానికి ట్యాగ్...ఇలా ఏ సమాసం కిందికి వస్తుందో వ్యాకరణవేత్తలు నిగ్గు తేల్చుకోలేకపోతున్నారు.

వేదం అందరూ చదవలేక, చదివినా అర్థం కాక, అర్థమయినా ఆచరించలేక వేదాంతాన్ని ఆశ్రయిస్తారు. తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం. తెలియకుండా చెప్పేది లేదా తెలియకుండా చేసేది వేదాంతం. ఇక్కడే ఫాస్ట్ ట్యాగ్ కు- వేదాంతానికి పొత్తు చక్కగా కుదురుతుంది.

టోల్ గేట్లు ఎందుకు? ఎన్ని యుగాలపాటు టోలు గేట్లలో మన తోలు ప్రయివేటువాడు వొలుచుకోవడానికి అధికారముంటుంది? అన్నవి అర్థరహితమయిన ప్రశ్నలు. సనాతన ధర్మంలో ఎన్నో జన్మల పాప పుణ్యాలు క్యారీ అవుతూనే ఉంటాయి. జన్మ రాహిత్యమే మోక్షం. కాబట్టి కొన్ని కోట్ల జన్మల్లో పేరుకుపోయిన మన పాపం పటాపంచలు కావాలంటే టోలు గేట్లగుండా మనం వీలయినంత ఎక్కువ ప్రయాణిస్తూనే ఉండాలి. దాంతో యమ స్పీడ్ గా పాప క్షయం అవుతుంది.

ఇదివరకు టోల్ గేట్లలో మనుషులు కూర్చుని డబ్బు తీసుకుని, ఇనుప రాడ్ పైకెత్తి వాహనాలను పంపే పద్ధతివల్ల పాపక్షయం స్లోగా ఉండేది. దాంతో జాతి విశాల పాపక్షయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చారు. ఇది మన పాస్ట్ జన్మల పుణ్య విశేష ఫలమైన ఫాస్ట్ ట్యాగ్!

ఫాస్ట్ ట్యాగ్ ముందే కొని మెడలో మంగళసూత్రంలా వాహనం ముందు అద్దానికి అతికించుకోకపోతే- టోల్ గేట్లలో రెండింతల జరిమానాకు దయగల చట్టం అనుమతిస్తోంది.

శంకరాచార్యులు అన్నపూర్ణ స్తోత్రంలో చివర ఫల శ్రుతిలో ఒక మాటన్నాడు.

“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!”

జ్ఞాన వైరాగ్యాలు భిక్షగా పెట్టు తల్లీ! అని అన్నపూర్ణ కాళ్లా వేళ్లా పడాలట మనం.

ఫాస్ట్ ట్యాగ్ ఉద్దేశం అదే. జ్ఞానానికి జ్ఞానం. వైరాగ్యానికి వైరాగ్యం. వేదాంతానికి వేదాంతం. వేగానికి వేగం. ఖర్చుకు ఖర్చు. పాపక్షయానికి పాపక్షయం!

“రోడ్లు అభివృద్ధికి సూచికలు”.
మన రోడ్లు బాగుండాలంటే మన చర్మం మనమే వలిచి, మనమే వాటిని రోడ్లకు ఒక మెత్తటి లేయర్ గా వేసి, సుఖమయిన ప్రయాణానికి మనకు మనమే అర్పణ కావాలి. హారతి కర్పూరం కావాలి. మన కొరకు, మన వలన, మన చేత, మనమే ఎన్నుకున్న మన ప్రభుత్వంలో “మన” మనుగడ ప్రశార్థకం కావాలి!

నోయిడా దగ్గర ఒక టోల్ గేట్ విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలు; చేసిన వ్యాఖ్యలివి:-

  • లాభాలు వచ్చాక కూడా టోల్ గేట్ ఎందుకు కొనసాగుతోంది?
  • ఎంత రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది?
  • ఆ ఖర్చును వడ్డీతోసహా వసూలు చేసుకున్న తరువాత ఇంకా ఆ టోల్ గేట్లు అలాగే ఉన్నాయంటే ఇది నిరంకుశత్వమే తప్ప ప్రజాపాలన ఎలా అవుతుంది?
  • ప్రయివేటు వ్యక్తులను పోషించడానికి ప్రజలెందుకు నష్టపోవాలి?

దేశంలో సగటున ఒక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల దాకా వసూళ్ళయ్యే టోల్ గేట్లను ప్రభుత్వం ఎత్తేస్తుందా? కలలో అయినా అది జరిగే పనేనా!

మాటవరసకైనా సర్వోన్నత న్యాయస్థానం మన బాధను తన బాధగా అన్నందుకు సంతోషించాలి.

ఫాస్ట్ ట్యాగ్ స్తోత్ర ఫలశ్రుతి:-
“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఫాస్ట్ ట్యాగ్ భిక్షామ్ దేహీ చ రహదారీ!”

(పాత కథనానికి కొసలో సుప్రీం కోర్టు వ్యాఖ్య మేళవింపు)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్