Friday, January 24, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంక్రూరమృగమ్ముల కోరలు తీసెను...

క్రూరమృగమ్ముల కోరలు తీసెను…

Terrific Traditions: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా దుష్టశక్తులు, దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని ఈ ఆచారం చెబుతుంది. ఆవు పంచకం, నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండడానికి యోగ్యమవుతోంది.

పురాణాల ప్రకారం దేవుళ్ల వాహనాలకు కూడా దైవత్వం ఉంటుంది.

శివుడు- బసవడు
విష్ణువు- గరుత్మంతుడు
గణపతి- ఎలుక
సుబ్రహ్మణ్యుడు- నెమలి
అమ్మవారు- పులి/సింహం

ఇలా ఒక్కో దేవుడు/దేవతకు ఒక్కో వాహనం మనకు తెలిసిందే. ఇప్పుడంటే మనకు బెంజులు, బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు వచ్చాయి కానీ- అనాది కాలంలో పరమేశ్వరుడయినా కాస్త అక్కడిదాకా డ్రాప్ ఇవ్వు అని ఎద్దునో, గద్దనో అడగాల్సిందే. ఆ రోజుల్లో పశువులు కూడా మాట్లాడేవి. దాంతో పరమేశ్వరుడు బిజీగా ఉంటే ఆయన వాహనం నందితో మాట్లాడినా పని అయిపోయేది. పదితలల రావణాసురుడిని నంది అడ్డుకుంటేనే కదా నానా గొడవ జరిగింది!

వ్యాసాలన్నిటికి ఆవు వ్యాసమే మూలం. లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి. ఆవుపాలు, ఆవు నెయ్యి శ్రేష్ఠం. లేపాక్షి నంది ప్రపంచ ప్రసిద్ధం.

లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ;
కైలాస శిఖరిలా కదలిరావయ్య ;
హుంకరించిన దెసలు ఊగిపోయేను;
ఖురముతో దువ్వితే కులగిరులె వణికేను ;
ఆకాశగంగకై
అర్రెత్తిచూస్తేను ;
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ;
నందిపర్వతజాత
నవపినాకినీ జలము ;
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ;
ఒంగోలు భూమిలో పెనుకొండ సీమలో ;
నీ వంశమీనాడు నిలిచింది గర్వాన”
-అడవి బాపిరాజు

హరప్పా మొహంజదారో అతిపురాతన మానవనాగరికత చిహ్నాల్లో దొరికినవాటిలో పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు ప్రధానమయినది.
గొడ్డును కొట్టినట్లు మనం కొడుతున్నా ఎద్దు
భరిస్తూనే ఉంది. గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది. పొలాలన్నీ హలాలతో దున్నుతూనే ఉంది. ఫలసాయాన్ని వీపున మోసి ఇంటికి తెస్తూనే ఉంది. మెడమీద కాడిని కట్టుకుని యుగాలుగా మన నాగరికతను లాగుతూనే ఉంది.

ఇప్పుడంటే మనకు ట్రాక్టర్లు, జె సి బీ లు, క్రేన్లు, ట్రాలీలు, హైడ్రాలిక్ లోడింగ్- అన్ లోడింగ్ లారీలు, డ్రిల్లర్లు, మోటారు పంపులు, సబ్మర్సబుల్ పంపులు…ఇలా అడుగడుగునా యంత్రాలే కనిపిస్తున్నాయి కానీ… ఇదివరకు ఈ పనుల్లో ఎక్కువభాగం ఎడ్లే చేసేవి.

పాడి పంటలు
బిడ్డొచ్చిన వేళ- గొడ్డొచ్చిన వేళ
దున్నపోతులా పెరిగావు
దున్నపోతు మీద వాన కురిసినట్లు
గోవిందుడు
గోధూళి
గోపాలుడు
గోప బాలురు…
ఇలా మన వాడుక మాటల నిండా ఉన్నవి ఆవులు, ఎద్దులు, దున్నపోతులే.


పాశం అంటే తాడు. పాశంతో కట్టి ఉంటుంది కాబట్టి పశువు అయ్యింది. మన్ అన్న సంస్కృత ధాతువు నుండి మనిషి అన్న మాట పుట్టింది. అంటే ఆలోచించే స్వభావం ఉన్నవారు అని అర్థం. ఇందులో నుండే మననం, మనసు, మానవత్వం పుట్టాయి. అందుకే అవి లేనప్పుడు మనిషివా? పశువ్వా? అంటాం. మనకుమాత్రమే మనసు, ఆలోచన, మననం ఉంటాయి, పశువులకు ఉండవు అనుకుని మనం చాలా పాశవికంగా ప్రవర్తిస్తున్నామేమో? గొడ్డును బాదినట్లు వాటిని బాదేస్తున్నాం. మనిషికో మాట – గొడ్డుకో దెబ్బ అని చెప్పి మరీ కుమ్మి పారేస్తున్నాం. పశువుల సంతగా మార్చేస్తున్నాం. ఎద్దు పుండు కాకికి ముద్దు. మనుషులు మాత్రం పశువులను అంతకంటే భిన్నంగా చూస్తున్నారా?

ఆవులు, ఎడ్లు తొక్కనినేల మన ఆచారంలో ఉపయోగించడానికి వీలులేనిది. చివరికి యజ్ఞం చేయాలన్నా మొదట కాడికి ఎడ్లను కట్టి, నాగలితో భూమిని దున్ని ప్రారంభించాలి. మిథిల అవుట్ స్కర్ట్స్ లో జనకుడు అలా దున్నుతుంటే నాగేటిచాలుకు దొరికింది సీతమ్మ. నాగేటితో దున్నినప్పుడు భూమిపై గింజలు చల్లడానికి అనువుగా చేసిన లైన్లను నాగేటి చాలు అంటారు. సంస్కృతంలో సీత. అందుకే ఆమె పేరు సీత అయ్యింది. జనకుడి కూతురుగా పెరిగింది కాబట్టి జానకి. మిథిలలో పుట్టింది కాబట్టి మైథిలి.

ఏనుగును అంకుశంతో నియంత్రించి దాని చేత చాకిరీ చేయించుకుంటాం.
కుక్కను మచ్చిక చేసుకుని దాన్ని కాపలా కాయమంటాం.
చిలుకను పంజరంలో పెట్టి పాటలు పాడమంటాం.
జూలో సింహానికి జూలు దువ్వుతూ సెల్ఫీ తీసుకోవాలనుకుంటాం.
నెమలి పింఛాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతాం.
పులిని చంపి మెడలో ఆ చచ్చిన పులి గోళ్లు తగిలించుకుని మిగతా పులులకు సింహ స్వప్నాలమవుతాం.
విషపు కోరల పాము ముందు నాగినీ గీతం పాడి పడగ విప్పి నాట్యం చేయమంటాం.

ఏది బలంగా ఉంటుందో దాన్ని జయించాలనుకోవడం అనాదిగా మనిషి నైజం. ఒకరి సాహసం మొదట్లో ఆశ్చర్యం, అద్భుతం. తరువాత అదొక ఆట అవుతుంది. ఆ ఆటను అందరూ నేర్చుకువడానికి విద్యలు, నేర్పులేవో పుడతాయి. అలా పుట్టిందే తమిళనాడులో ఎడ్లతో ఆడుకునే సహస విన్యాసం జల్లికట్టు. కర్ణాటకలో ఇలాంటిదే కంబళ. కొన్ని శతాబ్దాల ప్రయాణంలో అదొక ఆచారమయ్యింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం జల్లికట్టు/కంబళ నిషేధం. చివరకు వివాదం చినికి చినికి గాలివాన అయి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జల్లికట్టు/కంబళ లాంటివి ఆయా రాష్ట్రాల ఆచారాలని…వాటిని నిషేధించలేమని తీర్పు చెప్పింది.

కృత్రిమ మేధ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనిషి గుండెకు శస్త్ర చికిత్స కూడా చేయగలిగేంతగా మన మెదడు ఎదిగినా మన లోలోపల “పశుప్రేమ” మాత్రం పాతరాతి యుగంలో చెకుముకి రాళ్లతో అగ్గిరాజేసిన రోజు ఎలా ఉందో…అలాగే పాశం జారకుండా గట్టిగా ఉంది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్