Tuesday, May 6, 2025
HomeTrending Newsఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పరీక్ష నిర్వహణలో NTA(National Testing Agency) నిబద్దతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. నీట్-2024 నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మెడికల్ కాలేజీ అడ్మిష‌న్ల‌ను నిలిపివేయాలంటూ దాఖ‌లైన పిటీష‌న్ల‌పై ఈ రోజు(మంగళవారం) సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. అడ్మిష‌న్ల‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. కౌన్సిలింగ్‌ను ఆపడం లేద‌ని స్పష్టం చేసింది.

నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకైన‌ట్లు కొంద‌రు పిటీష‌న్ వేశారు. ఈ కేసులో నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీకి స‌మ‌న్లు జారీ చేసిన న్యాయమూర్తులు NTAపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. NTA ప‌రీక్ష‌లు నిర్వ‌హించినంత మాత్రాన ప‌విత్ర‌మైన‌ట్లు కాదని… విద్యార్ధి లోకం అనుమానాలతో ఆ ప‌రీక్ష‌ల ప‌విత్ర‌త దెబ్బ‌తిన్న‌ద‌న్నారు. దీనిపై త‌మ‌కు స‌మాధానాలు కావాల‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, ఆషానుద్దిన్ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసు విచారిస్తోంది.

కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం వెల్లడించింది. ఒకే కోచింగ్ సెంట‌ర్‌కు చెందిన 67 మంది విద్యార్థుల‌కు 720 మార్కులు వ‌చ్చాయ‌ని, అందుకే ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిషనర్లు డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వాలు నీట్-2024 రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. గ్రేస్  మార్కుల ప్రకటనలో NTA అక్రమాలకు పాల్పడిందని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రతి పక్షాలు విద్యార్థులతో గళం కలిపాయి. లోక్ సభ సమావేశాల్లో నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చకు పట్టుపడతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఇప్పటికే ప్రకటించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్