Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాటక విషాద మరణం

నాటక విషాద మరణం

ప్రఖ్యాత నాటక సమాజం సురభి విషాదాంతమవుతోందని ఒక వార్త వచ్చింది. నాటకం అసలే కొడిగట్టిన దీపం. ఆపై కరోనా విషపు కోరల పంజా విసిరింది. ఒక మహోన్నత నాటక వారసత్వంలో మిగిలిన ఒకటి అరా పాత్రధారులు కూడా కరోనాతో కన్ను మూస్తున్నారు.

2008లో ప్రముఖ రచయిత జి.ఆర్. మహర్షి “నెమలికన్ను” పేరిట తను ఇదివరకు రాసిన వ్యాసాలను సంకలనం చేస్తూ పుస్తకం ముద్రించారు. అందులో నాటకం విషాద మరణం మీద హాస్యంతో కన్నీళ్లు తెప్పించిన వ్యాసమిది. సురభి నాటక విషాదం నేపథ్యంలో ఆ వ్యాసం ఒకసారి చదవండి.

రంగస్థలంపై తెరలు ఎత్తకముందే విదూషకుడు ప్రత్యక్షమయ్యాడు.

విదూషకుడు:
దయతో ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని ప్రార్థన. మీరు చూడదలచుకున్న నాటకం తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. పరదాకి కట్టిన తాడుతో ఉరేసుకుంది. రంగస్థలం ముసుగు తొలగిస్తే మీరు ఉరికొయ్యకి వేలాడుతున్న నాటకాన్ని చూడొచ్చు. చివరిసారి నాటకం రాసిన ఉత్తరాన్ని చదవమంటారా?

విదూషకుడు చక్కని హాస్యం సృష్టిస్తున్నాడనుకున్న ప్రేక్షకులు బిగ్గరగా నవ్వుతూ ‘తొందరగా చదువు’ అంటూ అరిచారు.

విదూషకుడు జేబులోనుంచి ఒక ఉత్తరాన్ని తీసి

“ఇప్పుడు ప్రజలకు నాటకాలతో పనిలేదు. ఎవడి నాటకంలో వాడు మునిగిపోయాడు. ఇళ్లలోనూ, సందుగొందుల్లోనూ, వీధుల్లోనూ ఎక్కడ చూసినా నాటకాలే. ఎవడి స్క్రిప్ట్ వాడే రాసుకుని నటించేస్తున్నాడు. ఒకే వ్యక్తి అనేక పాత్రల్లో దూరి రక్తి కట్టిస్తున్నాడు. నటనిప్పుడు వెన్నతో పెట్టిన విద్య.

పరదాల చాటున, ఫోకసింగ్ లైట్ల వెలుగులో నడిచే నాటకం ఇక ఎవ్వరికీ అక్కరలేదు. ఆత్మహత్య చేసుకోవడం కూడా కొన్నిసార్లు సంఘసేవతో సమానం” అని చదవడం ముగించాడు.

జనం మళ్లీ చప్పట్లు కొట్టి  “ఇంతకీ ఏమంటున్నావ్?” అని అరిచారు.

విదూషకుడు:
నాటకం అంతిమ యాత్రలో పాల్గొనమని అడుగుతున్నాను.

ప్రేక్షకులు:
కుదరదు. మేము టికెట్లు కొని వచ్చాం. నాటకం చూపాల్సిందే. లేదా డబ్బులివ్వండి.

విదూషకుడు:
అయ్యా, నిర్వాహకుడు పరారయ్యాడు. వాడు బహుశా ఏ వీధిలోనే నాటకం శవాన్ని ముందు పెట్టుకుని డబ్బులు అడుక్కుంటూ వుంటాడు. (ఈ మాట ముగియక ముందే విదూషకుడిపై టమోటాలు, కోడిగుడ్లు పడ్డాయి)

ఇంతలో ఒక పెద్దమనిషి స్టేజిపైకి వచ్చి ఆగండి” అని అరిచాడు. “అయ్యా తమరెవరు?” అని విదూషకుడు అడిగాడు.

మనుషుల్ని జంతువులు వాసన పట్టినట్టు, రాజకీయమెక్కడున్నా నేను వాసన పడతాను” అన్నాడా పెద్దమనిషి.

విదూషకుడు:
ఇక్కడ రాజకీయమెక్కడుంది?

పెద్దమనిషి:
టికెట్లమ్మి నాటకం చూపించకపోవడం రాజకీయం కాదా. పెద్దమనిషి అనుచరులు ఐదుగురు స్టేజిపైకి ఎక్కారు.

“మా అన్న ఒక్క ఎమ్మెల్యే టికెట్ తప్ప ఇంకే టికెట్ కొనడు. అన్న కోరినట్టు నాటకం వేయకుంటే ఇప్పుడే ఆత్మాహుతి చేసుకుంటా” అని ఒక అనుచరుడు కిరోసిన్ నెత్తిన పోసుకున్నాడు. వెంటవున్న నలుగురు గట్టిగా పట్టుకుని అగ్గిపెట్టె అతనికి దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.

పెద్దమనిషి:
వీడు నాకోసం ఇప్పటికి నూటపదారుసార్లు ఆత్మాహుతికి ప్రయత్నించాడు. వాడిని రెచ్చగొట్టకు.

విదూషకుడు పారిపోడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూస్తున్న జనం ఈలలు వేశారు.

పెద్దమనిషి:
ప్రజలకు ఏదీ నేరుగా చెప్పకూడదు. అర్థం కాకుండా గందరగోళంగా సంక్లిష్టంగా చెప్పాలి. అప్పుడే చప్పట్లు కొడతారు. నాటకం అనవసరంగా ఎందుకు చనిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా?

ప్రేక్షకులు:
నాటకం చస్తే పీడపోయింది. కనీసం ఒక అధివాస్తవిక నాటకాన్నయినా చూపించండి.

విదూషకుడు:
ఎవరి మొహాలను వాళ్లు అద్దంలో చూసుకోండి. అద్దంలో మన మొహానికి బదులు వందరకాల ముఖాలు కనిపించడమే అధివాస్తవికత అంటే!

జనం మళ్లీ కోడిగుడ్లు విసిరారు. విదూషకుడి మొహం పచ్చడైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్