వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు. నేను ముసలివాడిని అయ్యాను. మా పెద్దబ్బాయి రాముడి చదువు సంధ్యలు, అస్త్ర శస్త్ర విద్యలు పూర్తయ్యాయి. గురువు వశిష్ఠుడి దగ్గర పరీక్షలన్నీ పాసయ్యాడు. రాముడిని రాజును చేసి నేను రిటైరవుదామనుకుంటున్నాను- అని. సభ కరతాళ ధ్వనులతో మారు మోగింది. ఈ వార్త తెలిసి అయోధ్య పొంగిపోయింది. కోసల రాజ్యానికి చిటికెలో కొత్త పండుగ శోభ వచ్చింది.
దశరథుడు రాముడిని పిలిచి- నాయనా తెల్లవారగానే నీకు పట్టాభిషేకం- వశిష్ఠుడిని అడిగి రాత్రికి ఉపవాసాది ప్రొటోకాల్ ఫాలో అయి, పొద్దున్నే తెల్లటి పట్టు బట్టలు కట్టుకుని, తెల్లటి ఛత్రచామరం నీడలో రా తండ్రీ! అని ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ చెప్పాడు. అలాగే అని నమస్కరించి వెళ్లాడు రాముడు. తెల్లవారక ముందే కథ అడ్డం తిరిగింది. దశరథుడి ప్రధాన సచివుడు సుమంతుడు రాముడిని అర్జంటుగా కైకేయి మందిరానికి తీసుకు వచ్చాడు. దశరథుడు రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి స్పృహదప్పి పడి ఉన్నాడు. ఏమిటి తల్లీ! నాన్నగారికి ఒంట్లో బాగలేదా? అని అడిగాడు రాముడు. కాదు నాయనా! నీ పట్టాభిషేకం క్యాన్సిల్. భరతుడికి పట్టాభిషేకం. నీకు పద్నాలుగేళ్లు అరణ్యవాసం. నువ్వేమంటావో…అన్న మాట పూర్తి కాకుండానే- అలాగే తల్లీ! నాన్న చెప్పినా, నువ్ చెప్పినా ఒకటే అని నమస్కరించి తన అంతః పురానికి బయలుదేరాడు. విషయం విన్న లక్ష్మణుడికి పట్టరాని కోపం వచ్చింది. ఏం తమాషాగా ఉందా? నాన్నను హౌస్ అరెస్ట్ చేసి- నీ పట్టాభిషేకం నేను చేయిస్తాను- ఈ రోజు నా కత్తికి ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటాడు. అయ్యో రామా! నిన్న ఇస్తానన్నది నాన్నే. ఇప్పుడు ఇవ్వనన్నది నాన్నే. ఇదంతా దైవ ఘటన. పలుగు పార, వెదురు బుట్ట, నార చీరలు సర్దుకో త్వరగా బయలుదేరాలి- అని రాముడు కూల్ గా చెప్పాడు.
దండకారణ్యంలో రావణుడు సీతమ్మను అపహరించుకుపోతే- రాముడు గుండెలవిసేలా రోదించాడు. ఎవరయినా సీతమ్మను చూశారా? అని గోదావరిని, చెట్టును, పక్షిని దీనంగా అడిగాడు. రావణుడికి భయపడి అవి నోరు విప్పలేదు. రాముడి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కరూ బదులు చెప్పరు- తమాషాగా ఉందా? అని కోదండం తీసి విల్లు ఎక్కు పెట్టి పంచ భూతాల మీద ప్రతాపం చూపించబోయాడు. అన్నా! మధ్యలో పంచభూతాలు ఏమి చేశాయి? నీ అంతటి వాడు ఇలా కంట్రోల్ తప్పితే ఎలా? అని శాంతపరిచాడు. రాముడు తగ్గాడు.
లక్ష్మణుడి కోపాన్ని రాముడు నిగ్రహించాడు. రాముడి కోపాన్ని లక్ష్మణుడు నిగ్రహించాడు. అవతార పురుషుడికయినా కోపం వస్తుంది. వెంటనే తనను తాను నిగ్రహించుకునో, పక్కవారు సర్ది చెప్తే వినో కోపావేశాలను తగ్గించుకోవడం ఉత్తముల లక్షణం.
రామాయణం దగ్గరినుండి నేరుగా ఛత్తీస్ గడ్ లో ప్రస్తుతానికి వద్దాం. లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తూ ఒక జిల్లా కలెక్టర్ ఒక సామాన్యుడి చెంప చెళ్లుమనిపించాడు. విచక్షణ కోల్పోయి అతడి సెల్ ఫోన్ నేలకేసి కొట్టాడు. సోషల్ మీడియా కెమెరా కళ్లు దీన్నంతా రికార్డు చేసి, ఆ వీడియోను ప్రపంచం ముందు పెట్టాయి. కలెక్టర్ క్షమాపణ చెప్పాడు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టర్ ను వెంటనే బదిలీ చేసింది.
పాము కుబుసం విడిచిపెట్టినట్లు తన కోపాన్ని తనే వదిలిపెట్టాలంటుంది నీతి శాస్త్రం.
“తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతి!”
-పమిడికాల్వ మధుసూదన్