రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసారు. వర్షాకాల సమావేశాలలో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీల పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరంతా తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. సీపీఎం ఎంపీ ఎలమారం కరీం ఓ పురుష మార్షల్‌పై దాడి చేశారని, ఛాయా వర్మ, ఫులో దేవి ఓ మహిళా మార్షల్‌పై దాడి చేశారని తెలిపింది. ఈ నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు సమర్పించింది. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, శివ సేన, తృణముల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున , సిపిఐ,సిపిఎం ల నుంచి ఒకరు చొప్పున సస్పెన్షన్ కు గురయ్యారు. కాంగ్రెస్ కు చెందిన ఫూలో దేవి నేతం, చాయ వర్మ, ఆర్ బోర, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ , అఖిలేష్ ప్రసాద్ సింగ్ సిపిఐ కు చెందిన బినోయ్ విశ్వం, సిపిఎం కు చెందిన ఎలామారం కరీం, తృణముల్ కాంగ్రెస్ కు చెందిన డోల సేన్, శాంత చేత్రి లు శివసేనకు నుంచి ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్ లు సస్పెన్షన్ వేటు పడ్డ వారిలో ఉన్నారు. శీతాకాల సమావేశాలు పూర్తి అయ్యే వరకు వీరి సస్పెన్షన్ అమలులో ఉంటుంది.
ఈ రోజు సభలో రైతు చట్టాల ఉప సంహరణ బిల్లు పైన రాజ్యసభలో విపక్షాలు చర్చకు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం రైతు చట్టాల ఉపసంహరణ బిల్లును రెండు సభల్లోనూ ఆమోదింపచేసుకుంది. దీంతో..విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. నినాదాలతో హోరెత్తించారు. ఛైర్మన్ ఎంత సేపు వారించే ప్రయత్నం చేసినా సభ్యులు వినలేదు. సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.