Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌ అలియాస్‌ పి.ఎలమందర్, కాజా శరత్‌.. అదనపు జడ్జీలు­గా నియమితులైన వా­రిలో  జె. శ్రీనివాసరావు, ఎన్‌.  రాజేశ్వర్‌రావు ఉ­న్నా­రు. వీరి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదించారు. నలుగురిని జడ్జీలుగా, ఇద్దరిని అదనపు జడ్జీలు నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. సంవత్సర కాలంలో 24 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. తాజాగా ఆమోదం పొందిన వారితో కలిపి ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఈ నేపథ్యంలో మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

కొత్త న్యాయమూర్తుల కుటుంబ నేపథ్యం, వివరాలు

ఈవీ వేణుగోపాల్‌.. 
1967, ఆగస్టు 16న కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావులకు జన్మించారు. తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. వీరికి శ్రీనివాసరావు, వేణుగోపాల్, శ్రీదేవి, శ్రీధర్, శ్రీకాంత్‌ సంతానం. వేణుగోపాల్‌ రెండోవారు. ఈయన డాక్టర్‌ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు. 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

తొలుత సీనియర్‌ న్యాయవాది రాంజెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. కరీంనగర్‌ కోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా వాదనలు వినిపించారు. 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ విభాగాల్లో రిట్‌ పిటిషన్లు, రిట్‌ అప్పీళ్లలో వాదించారు. ఉమ్మడి హైకోర్టులో రైల్వే కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్‌ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సివిల్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.

పుల్లా కార్తీక్‌… 
1967, జూన్‌ 4న జగిత్యాల పట్టణంలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. పాఠశాల విద్య జగిత్యాలలోనే పూర్తి చేశారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు.

అనంతరం ఉస్మానియా నుంచే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1996, మార్చి 27న అడ్వొకేట్‌గా బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. అన్ని విభాగాల న్యాయవాదిగా ఉమ్మ­డి ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ న్యాయవాదిగా నియమితులయ్యా­రు. 2017లో తెలంగాణ ప్రభుత్వ న్యాయ­వాది­గా నియమితులై.. ప్రస్తుతం కొనసాగుతున్నారు.

నగేశ్‌ భీమపాక..
1969, మార్చి 8న భద్రాచలంలో శాంతమ్మ, భూపతిరావులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భూపతిరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నగేశ్‌.. పాఠశాల విద్య భద్రాచలంలో, ఇంటర్‌ ఖమ్మంలో, ఎల్‌ఎల్‌బీ సీఆర్‌ రెడ్డి కళాశాలలో, ఎల్‌ఎల్‌ఎం నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్‌లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదిస్తున్నారు. సివిల్, క్రిమినల్, కాన్‌స్టిట్యూషనల్, లేబర్, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలు, గనుల కౌన్సిల్‌గా, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, అసిస్టెంట్‌ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు.

జగన్నగారి శ్రీనివాసరావు.. 
1969, ఆగస్టు 31న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం లింగన్నపేటలో జన్మించారు. తండ్రిపేరు మాణిక్యరావు. తల్లిపేరు లక్ష్మీబాయి. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేటలోని ప్రభుత్వ కాలేజీ నుంచి ఇంటర్, హైదరాబాద్‌ నారాయణగూడలోని భవన్స్‌ న్యూ సైన్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.

1999, ఏప్రిల్‌ 29న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్‌ సర్వీస్, నాన్‌ సర్వీస్‌ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్‌ మ్యాటర్స్‌కు సంబంధించి లోయర్‌ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. ఈయన గెలిచిన 60కిపైగా తీర్పులు లా జనరల్‌కు రిపోర్టు అయ్యాయి.

నామవరపు రాజేశ్వర్‌రావు.. 
1969, జూన్‌ 30న మహబూబాబాద్‌ జిల్లా సూదన్‌పల్లిలో జన్మించారు. ఈయన తల్లి పేరు గిరిజా కుమారి, తండ్రిపేరు సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో.. హైస్కూల్, ఇంటర్‌ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 2001, ఫిబ్రవరి 22న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు.

ఉమ్మడి ఏపీ హైకోర్టులో.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తొలుత సీవీ రాములు ఆఫీస్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు పనిచేశారు. యూజీసీ తరఫు అడ్వొకేట్‌గా(సెప్టెంబర్, 2015– అక్టోబర్, 2019) విధులు నిర్వహించారు. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ) కౌన్సిల్‌గా పనిచేశారు. 2016, ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ 2019 వరకు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యునల్‌ ప్యానల్‌గా విధులు నిర్వహించారు.

2019, నవంబర్‌లో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఎస్‌జీఐ)గా పనిచేస్తున్నారు. రిట్‌ పిటిషన్లు, సర్వీస్‌ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్‌ మ్యాటర్స్, వివాహ సంబంధిత, కార్పొరేట్‌ లా, మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌.. కేసుల్లో వాదనలు వినిపించారు. సరస్వతి శిశుమందిర్‌ విద్యా సంస్థల్లో చదివి సొలిసిటర్‌ జనరల్‌గా, హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన తొలి వ్యక్తి రాజేశ్వరరావు కావడం గమనార్హం.

కాజా శరత్‌…  
1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ) భద్రాచలంలోనే పూర్తి చేశా రు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లా, ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎం(కాన్‌స్టిట్యూషనల్‌ లా) పూర్తి చేశారు. 1997, డిసెంబర్‌ 31న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం, భద్రాచలం ట్రయల్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 2002 నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టులో అన్ని విభాగాల న్యాయవాదిగా కేసులు వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com