ఇండియానుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా మనా పటేల్ చరిత్ర సృష్టించారు. యూనివర్సాలిటీ కోటా కింద ఆమె ఎంపికయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఈ విషయాన్ని ద్ర్హువీకరించింది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన మానా పటేల్ స్విమ్మింగ్ లో విశ్వ క్రీడలకు అర్హత సాదించిన మూడో వ్యక్తి. ఇప్పటికే శ్రీహరి నటరాజ్, సాజన్ ప్రకాష్ లు ఒలింపిక్స్ బెర్త్ పొందారు. ఒలింపిక్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ అంశంలో మానా పాల్గొనబోతోంది.
ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు FINA పోటీ నిర్వహిస్తుంది. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ టైమింగ్ (ఒ.క్యు.టి.) ఆధారంగా తొలివిడతలో ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. దీన్ని ‘ఏ’ టైం విభాగంలో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ప్రతి దేశం నుంచి ఒక పురుష, ఒక మహిళా స్విమ్మర్ ను యూనివర్సాలిటీ కోటా కింద ఎంపిక చేస్తారు. అయితే ఆ దేశం నుంచి ‘ఏ’ టైం విభాగంలో ఎవరూ అర్హత సాధించకపోతేనే ఈ అవకాశం ఇస్తారు. మానా పటేల్ కూడా ఈ కోటా కిందే అర్హత సాధించింది.
జూన్ నెలలోనే స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మానా పటేల్ ను ఒలింపిక్స్ కు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ద్వారా ఈ విషయాన్ని ఫీనా (FINA) కు కూడా తెలియజేసింది.