Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాహ్ ! ఉస్తాద్!

వాహ్ ! ఉస్తాద్!

‘వాహ్! ఉస్తాద్! వాహ్!
అరె హుజూర్! వాహ్ తాజ్ బోలియే’
పండిట్ జాకిర్ హుసేన్ గురించి చాలా మందికి తెలిసింది ఇది ఒక్కటే. తాజ్ మహల్ నేపథ్యంగా గాలికి ఉంగరాల జుట్టు అల్లల్లాడుతుంటే తబలా వాయిస్తున్న ఆ కళాకారుడి రూపు, ఆనక టీ తాగడం…అలా గుర్తు ఉండిపోయింది. చాలా చిన్నతనంలో చూసిన ఈ ప్రకటన ప్రభావంతో అప్పటినుంచి తాజ్ మహల్ టీ తప్ప ఇంకో బ్రాండ్ తాగేవాళ్ళం కాదు. అలాగే తాజ్ మహల్ చూడాలనే కోరికనూ పెంచి పోషించింది. ఈ తబలా మాంత్రికుడు అప్పటినుంచి టీ తాగే సమయంలో తప్పనిసరిగా తలుచుకునే కుటుంబ సభ్యుడు అయ్యారంటే అబద్ధం కాదు.

తబలాతో ఉస్తాద్ ప్రయాణం పుట్టుకతోనే ప్రారంభమైంది. ఏడేళ్ల వయసులో తండ్రి ఉస్తాద్ అల్లా రఖా కఠిన శిక్షణతో మొదలైంది. అప్పటినుంచీ వెనుతిరిగి చూడలేదు. చిన్నవయసులోనే కచేరీల కోసం ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. రైల్లో సీట్ దొరకక పోతే వార్తా పత్రికలు నేలపై పరచుకుని నిదురించేవారు. తబలా మాత్రం ఒళ్లోనే ఉండేది. మొదటి పారితోషికంగా అందుకున్నది కేవలం అయిదు రూపాయలు. అయితేనేం…అప్పుడు ప్రారంభమైన ప్రయాణం ఎన్నో దేశాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. వెండితెరపైనా తళుక్కుమని మెరిసి హీట్ అండ్ డస్ట్ , సాజ్, మంకీ మాన్ చిత్రాలతో మెప్పించారు.

70 వ దశకంలో ప్రపంచాల మధ్య వారధిగా ఉస్తాద్ తబలా నిలిచింది. అలెన్ గింస్బెర్గ్ , జార్జ్ హారిసన్, ఇవాన్ మోరిసన్ వంటి గొప్ప కళాకారులతో కలసి ప్రదర్శనలు ఇచ్చేందుకు కారణమైంది. జాకిర్ తబలా వాయిద్యమే ఒక సంభాషణగా కళా ప్రియులను అలరించేది. అలాగే ఫ్యూజన్ బ్యాండ్ శక్తి ద్వారా జాకిర్ 1976 లో ఆల్బమ్ విడుదల చేసి చక్కటి విజయం సాధించారు. కారణాలేవైనా తర్వాత కొన్నేళ్లు దూరంగా ఉన్నా తిరిగి 2020 లో కలసి ది మొమెంట్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డుకు ఎంపికైంది. ఈ ఫిబ్రవరి లో జరిగిన గ్రామీ అవార్డుల్లోనూ మూడు సాధించి వాహ్ ఉస్తాద్! అనిపించుకున్నారు. భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో పాటు విదేశాల్లో అనేక అవార్డులందుకున్నారు. భౌతికంగా దూరమైనా తాజ్ మహల్ ఉన్నంత కాలం ఉస్తాద్ చిరంజీవి.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్