తాలిబన్లు అందరాబ్ లోయలోకి ఆహార, వైద్య సామాగ్రి రాకుండా అడ్డుకుంటున్నారని ఆఫ్ఘనిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లః సలెహ్ ఆరోపించారు. ఉగ్రవాదుల అరాచకాలు భరించలేక మహిళలు, పిల్లలు పర్వతాల వైపు పారిపోయారన్నారు. అనేకమందిని కిడ్నాప్ చేసి తమ స్థావరాలకు తరలించారని, అందరాబ్ లో వాతావరణం భయానకంగా ఉందన్నారు. ఆహారం, వైద్యం విషయంలో మానవతా దృక్పథంతో తాలిబన్లు వ్యవహరించాలని అమ్రుల్లః హితవు పలికారు. ఉత్తర బఘలాన్ ప్రావిన్స్ లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరాబ్ లోయ తాలిబాన్ల వశమైనా స్థానిక ప్రజలు వివిధ రీతుల్లో తిరుగుబాట్లు చేస్తున్నారు.
Panjshir valley
అహ్మద్ మసూద్ నేతృత్వంలో పంజషీర్ లోయ ప్రజలు తాలిబన్లను ఎదుర్కునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారని ఆపద్ధర్మ అధ్యక్షుడు వెల్లడించారు. పంజషీర్ ప్రజలకు సాయపడేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అమ్రుల్లః విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అమెరికా చొరవ తీసుకుంటేనే తాలిబాన్ల ఆగడాలు ఆగి, శాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు. తాలిబన్లను అడ్డుకునేందుకు పంజషీర్ లోయలోకి వచ్చే సలంగ్ ప్రధాన రహదారిని స్థానిక ప్రజలు మూసివేశారు. పంజషీర్ ప్రాంతంలోకి రావటానికి కొండలు, పర్వతాలు సహజ సరిహద్దులుగా ఉపయోగపడతాయి.
Ahmad massoud
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో సహాయ చర్యలు చేపట్టకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున ఈ వారంలో ఇదు వందల టన్నుల వైద్య సామాగ్రి, మందులు కాబుల్ రావాల్సి ఉంది. కాబుల్ నగరంలో పరిస్థితులు, విమానాశ్రయంలో అవాంచనీయ ఘటనలు అడ్డంకిగా మారాయి. కాబుల్, కుందుజ్, హెల్మాండ్ ప్రావిన్సుల్లో వేల మంది బాధితులు వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాసంస్థలు మూసివేయటంతో పది లక్షల మంది విద్యార్థుల చదువులు నిలిపోగా, అనేకమందిని తాలిబన్లు తమవెంట తీసుకెళ్లారని యునిసెఫ్ నివేదికలో వెల్లడైంది.