ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఓ వైపు రంగం సిద్దమవుతుంటే మరో వైపు మహిళల హక్కుల కోసం ఆందోళనలు ముమ్మరమయ్యాయి. కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కాబూల్లో వివిధ మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. తాలిబాన్ ప్రభుత్వం మహిళల హక్కుల్ని కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు.
అధ్యక్ష భవనం వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులపై తాలిబన్లు టియర్ గ్యాస్ ప్రయోగించి నిలువరించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకారులు చెల్లా చెడురయ్యారు. ముల్లా బరదర్ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని వారం రోజుల క్రితం హెరత్ నగరంలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
మరోవైపు పంజషీర్ లోయను కైవసం చేసుకునేందుకు తాలిబన్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాలిబన్లకు మద్దతుగా ఈ రోజు పాకిస్తాన్ నిఘా వర్ఘాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్ చేరుకున్నారు. అయితే తాలిబాన్ – పాకిస్తాన్ మధ్య సంబంధాల బలోపేతం కోసమే వచ్చినట్టు మీడియాకు వెల్లడించారు.