Tuesday, September 24, 2024
HomeTrending Newsతెలంగాణ హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: VHP

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: VHP

ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందని.. వైద్యులు మందులు.. ఇతర మెడిసిన్ వల్ల కరోనా పంతం కాలేదని.. కేవలం ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడడాన్ని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా.. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా.. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని హితవు పలికింది. శ్రీనివాసరావు మాటలను తప్పుపడుతూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. హిందుత్వాన్ని, వైద్య విధానాన్ని, సైన్స్ ను, శాస్త్రవేత్తలను కించపరిచే స్థాయిలో మాట్లాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బుధవారం కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవజాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అని కించపరిచే మాటలు మాట్లాడటాన్ని ప్రతి హిందువు తీవ్రంగా తప్పుపడుతున్నాడన్నారు.

యేసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందని మాట్లాడటంలో అసలు అర్థం ఉందా అని నిలదీశారు. ఏసుక్రీస్తుకు సంబంధం ఏమిటని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్షల మంది వైద్యులు.. కోట్ల మంది వైద్య సిబ్బంది.. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదన్న విషయాన్ని శ్రీనివాస్ రావు విస్మరించడం ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అన్నారు. తమ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరినీ హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా ఆయన మాట్లాడారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని వారు ప్రశ్నించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టులో ఆయనపై కేసు వేసి సస్పెండ్ చేసేదాకా పోరాడుతామని హెచ్చరించారు. గతంలో మూఢనమ్మకాల పేరుతో పూజలు నిర్వహించి వైద్య విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా వ్యవహరించారన్నారు. వెంటనే శ్రీనివాస్ రావు పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్