Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమగువల మెదడు గట్టిది

మగువల మెదడు గట్టిది

ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు నలుగురు పరధ్యానంగానో, నిరాశగానో కనిపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న సమస్యనూ పెద్దదిగా ఆలోచించడం… ఓర్పు, సహనం తగ్గిపోవడం.. సర్దుకుపోయే ధోరణి సన్నగిల్లడం… భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం, జీవిత భాగస్వామి, పిల్లల వల్ల కలిగే చికాకులతో చాలామంది డిప్రెషన్ కు లోనవుతున్నారు. మధ్య వయస్కులో… వివాహితులు మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నారనుకుంటే పొరపాటే.. పిన్న వయస్కులూ, పెళ్ళికానివారు కూడా నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడి, లక్ష్యాలు చేరుకోలేకపోవడం, ఉన్నత చదువులు, తమకు నచ్చినచోట ఉద్యోగమో, కాలేజీల్లో సీటు రాక కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు.

గతంలో తమ బాధలు చెప్పుకునేందుకు కొంతమంది ఆత్మీయ బంధువులు, స్నేహితులు ఉండేవారు. ఈ స్పీడ్ యుగంలో అలాంటి ఓదార్పు కూడా కరువైంది. ఒకరినొకరు కలుసుకొని స్థిమితంగా మాట్లాడుకునే తీరిక కూడా ఉండడంలేదు. ఏవో వేడుకల సమయంలో కలుసుకోవడం హాయ్, బాయ్ చెప్పుకోవడమే కానీ బాధలు పంచుకోవడం.. సలహాలు, సూచనలు, హితోపదేశాలు ఇచ్చిపుచ్చుకోవడం కరువైంది.

కొందరు యోగా చేస్తూనో, సంగీతం వింటూనో, తనకిష్టమైన ఇంటి పని, తోటపని చేసుకుంటూనో ఈ డిప్రెషన్ నుండి బైటపడడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనికోసం ‘యాంటీ డిప్రెసెంట్’ మందులు వాడుతున్నారు. ఒకరకంగా ఇది మత్తు మందు తీసుకోవడం లాంటిదే. ఈ మందుల్లో ఉండే ఔషధాలు మెదడులోని భావోద్వేగాల రూపకల్పన చేసే సెరటోరియస్ ను వృద్ధిచేస్తాయి. కానీ ఈ మందులు దీర్ఘ కాలం వాడడం ద్వారా అల్జీమర్స్, మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం లాంటి కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కూడా. అయినా సరే ఈ మందులు వాడడం తప్ప మరో మార్గం కనబడడంలేదు. అయితే ఈ మందుల ప్రభావం మగవారి మీదే ఉంటోందని, ఆడవారిపై దాదాపు వీటి ప్రభావం శూన్యమని ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ఆర్) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రాథమిక స్థాయిలో ఎలుకలపై జరిగిన పరిశోధనల తర్వాత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీలలో ఉండే ప్రత్యేక హార్మోన్లు, ఈస్ట్రోజన్ లాంటివి రక్షణ కవచంగా నిలిచి యాంటీ డిప్రెసెంట్ ల ప్రభావానికి అడ్డుకట్ట వేస్తున్నాయని తేలింది. వీటితో పాటు ప్రత్యేకంగా గర్భిణీలు వాడే బి 3 టాబ్లెట్లు కూడా ఈ దుష్ప్రభావాలను అడ్డుకుంటాయని తేలింది.

ఈ పరిశోధనలు పూర్తి స్థాయిలో జరిగి పురుషుల్లో కూడా యాంటీ డిప్రెసెంట్ ల వాడకం ద్వారా తలెత్తే వ్యాధులు, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు కనుగొంటే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular