Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొండను తవ్వి...

కొండను తవ్వి…

Sonu Sood Hero or Zero?

ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు.. మన దేశంలో ఒక్కసారిగా 70 ఎం‌ఎం లో ముందుకు దూసుకొచ్చిన పేరు- సోనూ సూద్.
కోవిడ్ వ్యాప్తి భయాలను మొదట కొట్టి పారేసిన కేంద్రం, హఠాత్తుగా కళ్ళు తెరిచి.. దేశ ప్రజలనంతా ఎక్కడికక్కడ “లాక్ డౌన్ (నిర్బంధం)” చేయమని ఆదేశాలు ఇచ్చిన సందర్భమది.ఈ నిర్బంధం ఎన్ని రోజులో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. తమ ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియదు. ఆగమ్య గోచరం ‘వలస కార్మికుల’ పరిస్థితి.

కొన్ని చోట్ల క్రీడా మైదానాలలో, ఫంక్షన్ హాళ్ళలో, స్కూళ్ళలో, కాలేజీలలో ఎక్కడ దొరికితే అక్కడ ఈ వలస కార్మికుల నిర్బంధం.. ఈ నిర్బంధాన్ని తప్పించుకొని .. చంటిపిల్లలను చంక నేసుకొని, చెప్పులు లేని కాళ్లతో, రోడ్ లు పట్టుకొని, రైలు పట్టాలు పట్టుకొని వందల కిలో మీటర్ల దూరం ఈ “వలస కార్మికుల” ప్రయాణం చూసి ఎన్నో హృదయాలు మౌనం గా రోదించాయి. నిశబ్ధంగా ఘోషించాయి.కానీ హృదయ రోదనకు అడ్డుకట్ట వేసి.. ఆ వలస కార్మికులను ఆదుకోవాలని స్పందించి, వాళ్ళను తమ గమ్య స్థానాలకు చేర్చడానికి నడుంబిగించిన అతి కొద్దిమందిలో సోనూ సూద్ ముందున్నారు.

తన ఖర్చులతో వారిని విమానాల్లో, రైళ్లలో, బస్సుల్లో తరలించారు. వలస కార్మికుల పాలిటి “దైవం” గా నిలిచాడు.ఇక రెండవ విడత కోవిడ్ దేశాన్ని చుట్టేసిన సందర్భం లోనూ.. దేశవ్యాప్తంగా ఉచితంగా ఆక్సిజన్ సిలెండర్లు అందించడంలో ఊహించలేనంత వేగంగా స్పందించి ప్రజల అభిమానం సంపాదించారు. ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాలను వదిలేసి అవసరం కోసం చాలామంది ఈ “ఆపద్భాంధవుడి” నే కేకేసి పిలిచారు.

సాధారణంగానే ఇది కొంతమందికి కంటకప్రాయం ఆయింది. ఎందుకు కాదు? నిర్బంధం లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఆహారం, బియ్యం , గోధుమలు, ఒకటేమిటి చివరకు ఐదువందల నోట్లే డైరెక్ట్ గా పంచిన ప్రభుత్వాలను, ప్రభుత్వాధినేతలను వదిలేసి ప్రజలు ఒక “సినీ నటుడి” వెంట పడితే కడుపు మండదా?

ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఎప్పటినుంచో ఉన్నా.. కోవిడ్ రాగానే అప్పటికప్పుడు “పియమ్ కేర్స్” అని ఫండ్ కొత్తగా పెట్టి ఐదు రోజుల్లో రూ.3076 కోట్లు జనాన్నుంచి వసూలు చేసి.. బాధితులను ఆడుకోవడానికి “మోడీ” నానా కష్టాలు పడుతుంటే వదిలేసి.. జనం ఈ మామూలు “నటుడి” వెంటపడితే కళ్ళుమండవా?కన్నెర్రబడడా? అందుకే ప్రభుత్వం కన్నెర్రబడింది.

మూడు రోజులపాటు “సోనూ సూద్” లెక్కలన్నిటిని తూర్పారబట్టి ..20 కోట్లు “పన్ను” ఎగవేసినట్లు గ్రహించేశారు. అంటే దాదాపు 66 కోట్ల లెక్క చెప్పని సంపాదన ఉందని తేల్చాశారు. ఇంకా అనుమతి లేకుండా విదేశాలనుంచి చందాలు సేకరించారని కనిపెట్టేశారు. దాతల నుంచి సేకరించిన నిధులు 18 కోట్ల కు పైగా ఉంటే కేవలం రూ.1.89 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లెక్కగట్టారు. .జనం అనుకొన్నట్లు సోనూ సూద్ “హీరో” కాదని“పన్ను ఎగవేత దారుడు”, “విదేశీ నిధులు అనుమతి లేకుండా సేకరించిన అనుమానిత నేరస్థుడు” గా తేల్చేశారు.

కానీ సోనూ సూద్ ఎంతమంది వలస కార్మికులను గమ్యం చేర్చాడు, ఎన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు పంచాడు, ఎంతమందికి సహాయం చేశాడు.. ఇవ్వన్ని ప్రభుత్వానికి అవసరం లేదు. ఎంత సంపాదించాడు, ఎలా సంపాదించాడు, ఎంత ఖర్చుపెట్టాడు, ఎలా ఖర్చు పెట్టాడు.. అంతే.

మరి ఇదే ప్రభుత్వం “పియం కేర్స్” క్రింద ఎంత వసూలు అయ్యింది, ఎంత ఖర్చు అయ్యింది” అని ప్రతిపక్షాలు అరిచి గీ పెడుతున్నా చెప్పడం లేదు.. అంతా ఉదారంగా ప్రభుత్వానికి నిధులు ఇచ్చిన దాతల పేర్లు చెప్పడం లేదు. ఎందుకు? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజా ప్రభుత్వాలు, ప్రభుత్వాధి నేతలు ఏది చేసినా ప్రజల కోసమే.

దాన్ని ప్రజలు అనుమానించకూడదు!! ప్రశ్నించకూడదు!! అయిన భార్య, పిల్లలు, కుటుంబాలు లేని వారు ప్రజలకోసం కాక ఎవరికోసం బతుకుతారు!!

కంపనీలు “కార్పో రేట్ ల సామాజిక బాధ్యత” క్రింద తమ లాభాల్లో కొంత ఖర్చు పెట్టాలని ప్రభుత్వం 2013 లో ఒక చట్టం చేసింది. ఇది సామాజిక బాధ్యతల నిర్వహణలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుందని భావించింది. అలానే వ్యక్తిగత పన్ను దారులకు కూడా “వ్యక్తిగత సామాజిక బాధ్యత” క్రింద కొంత “పన్ను పరిధి లోకి వచ్చే ఆదాయాన్ని” అనుమతించిన సంస్థలకు/ట్రస్ట్ లకు చందాలా కాకుండా, స్వంతంగా ఖర్చు పెట్టుకొనే అధికారం ఇవ్వాలేమో.

ఏది ఏమైనా సోనూ సూద్ “హీరో” నా, “జీరో” నా .. ప్రభుత్వం తేల్చేసింది.
ఇక ప్రజలే తేల్చుకోవాలి.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read: 

అదానీ రోడ్ లు…అంబాని స్టేషన్లు

Also Read:

పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్