Thursday, March 28, 2024
HomeTrending Newsఅసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు అచ్చెన్న సవాల్

అసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు అచ్చెన్న సవాల్

మూడు రాజధానులపై ప్రజాతీర్పు కోరదామని, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. రేపో మాపో గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని సూచించారు. తాము అమరావతికే కట్టుబడి ఉంటామని, ఒకవేళ నిజంగా మా విధానం తప్పయితే, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే తాము కూడా ఒప్పుకున్తామని ప్రతిపాదించారు.  మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు. సిహెచ్ అయ్యన్న పాత్రుడులతో కలిసి మీడియాతో అచ్చెన్న మాట్లాడారు.

అమరావతి రాజధానిపై  మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వారికి ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని  విమర్శించారు. వారు అధికారంలో ఉంటే ఒక మాట, లేకపోతే ఒకలాగా మాట్లాడతారని దుయ్యబట్టారు.  మీ స్వార్ధం కోసం, పదవుల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు.  మూడేళ్ళ పాటు నోటికి ప్లాస్టర్ అంటించుకున్న మంత్రి ధర్మాన… పదవి ఇచ్చేసరికి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  2019లో అమరావతి రాజధాని పేరు చెప్పే ఎన్నికలకు వెళ్లామని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే నినాదంతో వెళ్తామని, తన రాజీనామా కోరుతున్న వారికి పిచ్చెక్కి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి అంశాలపై స్పందించని నేతలు ఇప్పుడు రాజీనామా అంటూ ప్రకటనలు చేయడానికి సిగ్గుండాలన్నారు. తమ హయంలోనే వైజాగ్ ను  ఎంతో అభివృద్ధి  చేశామని చెప్పారు.  రైతులు పాదయాత్ర చేస్తుంటే దండయాత్ర చేస్తామని మంత్రులు అంటున్నారని, అరసవిల్లి, శ్రీకాకుళం, వైజాగ్ మీ జాగీరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి అంశాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని…దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఏపీ రాష్ట్రానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. రాజధానులపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని సాక్షాత్తూ మీ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు పేటెంట్ హక్కులు తెలుగుదేశం పార్టీవేనని స్పష్టం చేశారు. ప్రజల వద్దకు పాలన, జన్మ భూమి కార్యక్రమాలతో అధికారులనే ప్రజల వద్దకు పంపి సమస్యలు పరిష్కరించింది చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజల మధ్య వైవిధ్యాలు సృష్టిస్తే అది పరిపాలనా వికేంద్రీకరణ కాదన్నారు. అందరి ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.  అన్నిజిల్లాలూ అభివృద్ధి చెందేలా ఓ ప్రణాళికతో ముందుకు వెళ్ళామన్నారు.

Also Read : రాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్