టిడిపి ఉన్మాదానికి పరాకాష్ట: సజ్జల

గన్నవరంలో మొన్నటి గొడవకు టిడిపి నేత పట్టాభి కారణమని, ఆయన వైఎస్సార్సీపీ నాయకులను బూతులు తిట్టడం, సవాళ్లు విసరడం వల్లే గొడవ మొదలయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. గన్నవరంలో గత పది రోజులుగా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీని రెచ్చగొట్టేలా సవాళ్లు విసురుతున్నారని, తనపై చంద్రబాబో, లోకేశో వచ్చి పోటీ చేస్తే తన సత్తా చూపిస్తానని వల్లభనేని వంశీ వారికి సమాధానమిస్తే.. పట్టాభి అనే బూతులు తిట్టే ఆంబోతు.. బాబు, లోకేశ్‌లు ఎందుకు? తానే వస్తానని రెచ్చిపోయి, రంకెలు వేస్తూ, సవాళ్లు విసురుతూ గన్నవరం వెళ్లాడని సజ్జల తీవ్రంగా మండిపడ్డారు. పిల్ల సైకో అని,  వంశీని, గుడివాడ నానీని నానా బూతులు తిట్టిన సంస్కారం అతనిదని, బూతులు తిట్టడం వల్లే బాబు పట్టాభిని పోషిస్తున్నాడని తాను భావిస్తున్నట్లు సజ్జల చెప్పారు. ‘పట్టాభి గన్నవరం పోకపోతే ఈ గొడవెందుకు ఉంటుంది? లేదూ పోట్లాటలే మా జన్మహక్కని, రౌడీలా వ్యవహరిస్తామని అనుకుంటే అదైనా ప్రకటించుకోవాలి’ అంటూ సజ్జల సలహా ఇచ్చారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని, ఆ పార్టీ వాళ్లే ప్రత్యర్థులపై దాడులు చేసి.. వారే కేసులు పెడతారని… వారే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని, తప్పును మాత్రం అధికార పార్టీపై నెట్టేసే విచిత్ర సంస్కృతి అవలంబిస్తోందని సజ్జల అన్నారు. ఇలాంటి వాటికి ఈనాడు వంటి పత్రికలు అగ్నికి ఆజ్యంలా తప్పుడు రాతలతో చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మీడియా టెర్రరిజం సృష్టించే విస్ఫోటం ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదకరంగా మారిందని అభివర్ణించారు. టీడీపీకి, ఈ ఎల్లో మీడియాకు రాష్ట్రం విడిపోయిందన్న బాధ లేదని, రాష్ట్ర సంక్షేమం పట్టదని,  తెలిసిందల్లా తప్పుడు రాతల విద్య ఒక్కటేనని అన్నారు.

గన్నవరం దాడులను సమర్థించడం లేదని కానీ ఎదురుదాడి చేస్తే భరించాలా? అని సజ్జల ప్రశ్నించారు  గన్నవరం వెళ్లి దాడులకు దిగింది పట్టాభి అని, పోలీసులను కొట్టింది టీడీపీ వర్గాలని, తాము అన్నిచోట్లా సంయమనంతో ఉంటున్నామని వెల్లడించారు. విశాఖలో ఎయిర్‌పోర్టులో జగన్‌గారిపై కత్తితో ఒకరు దాడిచేస్తే.. డీజీపీతో ఏం చెప్పించారు? జగన్‌ గారి అభిమానులు చేశారని వక్రీకరించింది టీడీపీ కాదా అని నాటి ఘటన గుర్తు చేశారు. పట్టాభి బూతులు తిట్టినా, ఎంతో ఓర్పుతో పోలీసులు వ్యవహరించారు. ఇందుకు వారిని అభినందించాలని అన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం సిఎం జగన్‌ ఇస్తున్న ప్రాధాన్యం టీడీపీకి మింగుడు పడడం లేదని, తాజాగా ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలను జగన్‌ గారు ఎంపిక చేయడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వకుండా చేయాలన్న తప్పుడు ఆలోచనలతో టీడీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : వ్యక్తిత్వ హననం చేస్తున్నారు: వంశీ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *