Monday, January 20, 2025
HomeTrending Newsదళితులను ఆదరించింది మేమే: బాబు

దళితులను ఆదరించింది మేమే: బాబు

నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పట్టుబట్టి డా. అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించారని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బాబూ జగ్జీవన్ రాం చనిపోయిన తరువాత అయన తొలి కాంస్య విగ్రహాన్ని ఎల్బీ స్టేడియం ముందు ఏర్పాటు చేసింది కూడా తామేనన్నారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నియమించింది కూడా తామేనని గుర్తు చేశారు. కాకి మాధవరావుకు చీఫ్ సెక్రటరీ గా అవకాశం ఇచ్చామని, బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేశామని చెప్పారు. దళితులపట్ల తనకున్న ప్రేమకు ఇవన్నీ నిదర్శనాలని పేర్కొన్నారు. మహాసేన రాజేష్ నేడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు, ఈ సందర్భంగా బాబు మాట్లాడుతో దళిత అభ్యున్నతి కోసం తాను చేసిన కృషిని వివరించారు.

దళితుల అభ్యున్నతి కోసం జస్టిస్ పున్నయ్య కమిటీ నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని బాబు అన్నారు. ఆ కమిటీ సిఫార్సులను వెంటనే ఆమోదించి అమలు చేశామని గుర్తు చేశారు. గతంలో సమాజంలో ఎన్నో రకాల వివక్షలు ఎదుర్కొన్న దళితులకు అండగా నిలిచింది టిడిపి మాత్రమేనని స్పష్టం చేశారు.  దళితులకు భూమి పంచి వారి గౌరవం పెంచామని,  జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్స్ కల్పించామన్నారు. ‘దళితులుగా ఎవరైనా పుడతారా’ అంటూ తాను అన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేసింది, నాడు తాను చెప్పిన మాటలను వెనుకా ముందూ కత్తిరించి ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలు గత ప్రభుత్వ హయంలో తాను ప్రవేశ పెట్టానని వివరించారు.

దళిత పిల్లల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రవేశపెట్టామని, విదేశీ విద్య పథకం పెట్టామని, యూనివర్సిటీల్లో రెండో పిజికి కూడా స్కాలర్ షిప్ లు అందించామని వివరించారు. సిఎం జగన్ దళితులను పూర్తిగా విస్మరించారని,తాము ప్రవేశపెట్టిన పథకాలన్నీ అపేశారని బాబు ఆరోపించారు. దళితులు ఉండవలసిన పార్టీ టిడిపి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న యువత అంతా భవిష్యత్ కోసం ఆలోచించాలని, ఈ ప్రభుత్వంపై పోరాటానికి కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.

Also Read: భరత్ కు జగన్, చంద్రబాబు అభినందనలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్