Saturday, November 23, 2024
HomeTrending Newsఏపి ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి

ఏపి ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి

ఎట్టకేలకు పాత మిత్రులు ఏకం అయ్యారు. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తులు ఖరారు అయ్యాయి. కొద్దిరోజులుగా వస్తున్న ఉహాగానాలు వాస్తవ రూపం దాల్చాయి. మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటామని జనసేన, టిడిపి, బిజెపిలు శనివారం(మార్చి-09)న సంయుక్త ప్రకటన చేశాయి. రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

మూడు పార్టీలు కలిస్తే 2014లో మాదిరిగానే అధికారంలోకి వస్తామనే విశ్వాసంతో నేతలు ఉన్నారు. అప్పటి పరిస్థితులు వేరు అనే విషయం చంద్రబాబుకు తెలిసినా బిజెపి బోనులో పడ్డారు కనుక ఇక ఎటూ తేల్చుకోలేని స్థితిలో కలిసి సాగేందుకు సిద్దం అయ్యారు.

బాబు జైలులో ఉన్నపుడు జనసేన, టిడిపి మధ్య పొత్తు కుదిరిందని ప్రకటించినా జనసేన మా మిత్రపక్షమే అని బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి పలుమార్లు ప్రకటించారు. టిడిపితో స్నేహం కోసమే పవన్ రాయబారం సాగిందని… సైకిల్ ని దారిలోకి తెచ్చేందుకు కొంత సమయం పట్టింది.

బిజెపితో స్నేహం ద్వారా ముస్లిం, క్రైస్తవ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉంది. గుంటూరు నుంచి నెల్లూరు వరకు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ముస్లిం ఓట్లు గెలుపు ఓటముల్ని ప్రభావితం చేస్తాయి. రాష్ట్రంలోని 6౦ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు.

కోస్తా జిల్లాల్లో క్రైస్తవులు మరో ప్రభావిత వర్గం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వీళ్ళు గంపగుత్తగా ఎటువైపు మొగ్గితే వాళ్ళదే గెలుపు. బిజెపితో పొత్తు పెట్టుకునే పార్టీలకు ఓటు వేయొద్దని క్రైస్తవ కూటముల్లో కొద్ది రోజులుగా ప్రసంగాలు సాగుతున్నాయి. బిజెపితో కలిసి వస్తున్న టిడిపి, జనసేనలకు ఆయా వర్గాల్లో భంగపాటు తప్పదని విశ్లేషకుల అంచనా.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల స్థానాలే నిర్ణయిస్తాయి. విభజనకు ముందటి ఉమ్మడి గోదావరి జిల్లాలోని -34 స్థానాల్లో ఎవరు ఆధిక్యత సాధిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని గత అనుభవాలు రుజువు చేశాయి.

తెలంగాణలో ఫలితాలే ఏపిలో పునరావృతం అవుతాయని ఇన్నాళ్ళు భావించిన తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. పొత్తుల్లో మిత్రపక్షాలకు కేటాయించే స్థానాల్లో ఇప్పటికే తిరుగుబాట్లు మొదలయ్యాయి. బిజెపి హిందుత్వ నినాదం రాష్ట్రంలో పనిచేయకపోగా టిడిపి, జనసేనలకు చేటు తెచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్ళు లెక్కలు వేస్తున్నారు. ఓట్ల బదిలీ అంత సులువు కాదని..వెన్నుపోట్లకు అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.

అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉందని నిరూపించేందుకు బిజెపి పొత్తుకు సిద్దం అయిందట. 2014 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు విడిపోయాయి. ఆ సమయంలో చంద్రబాబు చేసిన విమర్శలు బిజెపి నేతలు ఇంకా మరచిపోలేదు. పాత మిత్రులతో కొత్తగా పొత్తు పెట్టుకోవటంపై ప్రధాని మోడీ అయిష్టంగానే సమ్మతించారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజా కలయికతో బిజెపి ఖాతాలో ఎంపి సీట్లు పడవచ్చు కానీ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటం సులభతరం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పురుందేశ్వరి, పవన్ కళ్యాణ్ లోక్ సభకు వెళ్ళటం మినహా టిడిపికి మేలు చేయదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయం చేసి ఉంటే… బాబుకు ఇంత దయనీయ పరిస్థితి దాపురించి ఉండేది కాదనే వాదన ఉంది. ఇన్నాళ్ళు టిడిపి వెంట ఉన్న వామపక్షాలు షరామాములుగా ఇప్పుడు విమర్శలు చేయటం కొసమెరుపు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్