Kanakamedala on AP finance situation:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని…. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అప్పులకోసం ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో ఏపీ పరువు తీస్తున్నారని, ఏపీ ఆర్ధిక మంత్రి ఎప్పుడూ ఇక్కడే ఎందుకు ఉంటున్నారో, అసలు ఢిల్లీ లో ఏం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రహస్యాలు ఉన్న చోటే కుట్రలు, మోసాలు కూడా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రుణ పరిమితి పెంపు కోసం ఢిల్లీ లో ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తోందని, ఇది చూసి ప్రభుత్వం వణికిపోతోందని కనకమేడల ఎద్దేవా చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని, ఆయా సంస్థల ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ను ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోందని, విద్యుత్ ఒప్పందాల్లో కూడా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం అభ్యంతరకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని,ఏపీ పరువు మర్యాదలను కాపాడాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి: ఆచి తూచి నిర్ణయం : బుగ్గన