రేషన్ డీలర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని, గ్రామ వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డీలర్లను డమ్మీలుగా మార్చారని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులు మినీ సూపర్ మార్కెట్లుగా ఉండేవని, ఈ ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార, పప్పులకు మాత్రమే షాపులను పరిమితం చేసిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్ల సంఘం నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు నేటి నుంచి సమ్మెకు దిగారు. ఖాళీ గోనె సంచులు తిరిగి ఇవ్వాలని, ఇవ్వకపోతే కేసులు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ దుకాణాల బంద్‌కు రేషన్ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకణాల్లో రేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాన్ యోజన్ పథకం కమీషన్ బకాయిలు ఇవ్వాలని డీలర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గోనెసంచులు ఇస్తే సంచి ఒక్కింటికి 20 రూపాయలు ఇస్తామని గతంలో ఉత్తర్వులు ఇచ్చారని, తాజాగా సంచులు ఇచ్చినా డబ్బులు చెల్లించబోమని చెబుతున్నారని వారు వాపోతున్నారు.