TDP to protest: కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో జరిగిందని ప్రతిపక్షనేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జిల్లాలు ఏర్పాటు చేసిన రోజే రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో బాదుడుకు తెరతీశారని ఆరోపించారు. టిడిపి సీనియర్ నేతలతో బాబు సమావేశమయ్యారు, కొత్త జిల్లాల ఏర్పాటు, పన్నుల భారం, విద్యుత్ ఛార్జీల పెంపు ఇతర అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరో శ్రీలంకగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారంపై బాడుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ఈ నెలాఖరు వరకూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచాలని సమావేశంలో నిర్ణయించారు. మూడేళ్ళ కాలంలో ఏడుసార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో 16 వేల కోట్ల రూపాయల భారం మోపారని, ఈ ప్రభుత్వం పెంచిన అన్ని టాక్స్ లతో ప్రతి ఇంటిపై ఒక లక్షా పది వేల రూపాయల భారం పడిందని బాబు విశ్లేషించారు.
సిఎం జగన్ ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని బాబు అన్నారు. అమరావతిలో 80 శాతం పూర్తయిన భవనాలను కూడా పూర్తి చేయలేక పోతున్నారని బాబు విస్మయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న తీరుపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.