తల్లిరో సరస్వతి
నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
అక్షరములై పుస్తకములో
గానమై కలకంఠి ముఖమున
శబ్దములు ముత్యాలవలె నీ
పాలవెల్లువ లోన తేలెను…
హంస నేర్పును చిలుక పలుకులు
మా కొసంగుము శారదా…
చదువులతల్లి ప్రాభవాన్ని వివరిస్తూ రాయప్రోలు సుబ్బారావు రచించిన గీతంలోని కొన్ని వాక్యాలివి. విద్యనేర్పే గురువులను సాక్షాత్ సరస్వతీ స్వరూపంగానే భావిస్తారు. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో గురు శిష్య సంబంధం అంత ఆరోగ్యంగా ఉండటం లేదు. అయినా అక్కడక్కడ దయగల ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి శిష్యులే ప్రధానం. వారికోసం కొండలు గుట్టలు ఎక్కుతారు. పడవలేసుకుని వాగులు దాటుతారు. అక్షర జ్ఞానం కలిగించడానికి వీధి వీధీ తిరుగుతారు. ఆ కోవకు చెందిన టీచర్ సజ్జనం భాగ్యలక్ష్మి.
కరోనా కారణంగా రెండేళ్లుగా చదువులకు దూరమయ్యారు విద్యార్థులు. ఆన్లైన్ చదువులు కొందరికే. ప్రాథమిక స్థాయి గ్రామీణ విద్యార్థులకు ఏ క్లాసులూ లేవు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. చదువు విలువ తెలియని బాల్యం ఎప్పుడూ ఆటపాటలనే కోరుకుంటుంది. ఇక్కడే వినూత్నంగా ఆలోచించింది భాగ్యలక్ష్మి. పెద్దపల్లి జిల్లాలో పుట్టపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఈమె. ఇద్దరు టీచర్లు, 16 మంది విద్యార్థులు. కరోనా వల్ల బడి మూత పడి పిల్లలు అక్కడా ఇక్కడా ఆడుకుంటూ గడిపేస్తున్నారు. ఇది గమనించిన భాగ్యలక్ష్మి ఆటలాడుకునే వీధుల్లోనే అక్షరాలు దిద్దించాలని ఆలోచించింది. ఊళ్ళో వాళ్ళని ఒప్పించి గోడలపై రంగులతో అక్షరాలు, లెక్కలు, పదాలు రాయించింది. దాంతో ఆటలాడే పిల్లలు చదువుకోడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడా ఊరంతా పాఠాలు నిండిన గోడలతో చదువుల బడిలా తయారైంది. పేరులోని సజ్జనత్వాన్ని అణువణువునా నింపుకుని పిల్లలకు చదువుల తల్లి అనిపించుకుంటూ అభినందనలందుకుంటోంది భాగ్యలక్ష్మి. ఈ స్ఫూర్తి తో పల్లెలన్నీ కళకళ లాడాలి.