వైద్యవిద్యలో ఆర్.ఎస్.ఎస్, జన సంఘ్ నేతల పాఠ్యాంశాల బోధనపై మధ్యప్రదేశ్ లో రాజకీయ దుమారం మొదలైంది. బిజెపి హిందుత్వవాదాన్ని రుద్దుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వైద్యవిద్యకు ఆర్ ఎస్ ఎస్ నేతలకు సంభందం ఏమిటో అర్థం కావటం లేదని హస్తం నేతలు విమర్శించారు. జనసంఘ్ నేతల గురించి తెలుసుకొని వైద్యం చేసేటపుడు వారి పాఠ్యాంశం దగ్గర పెట్టుకొని డాక్టర్లు చికిత్స చేయాలా అని ప్రశ్నించారు. బిజెపి నేతలు మరోసారి దేశ విభజనకు దారితీసే విధానాలు చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వ్యాపం కుంభకోణంతో మధ్యప్రదేశ్ ప్రతిష్ట మసక బారిందన్నారు.
వైద్యవిద్యలో ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ హెగ్డేవార్, జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పాఠ్యాంశాలను ఈ ఏడాది నుంచి ప్రవేశ పెడతామని నిన్న మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ప్రకటించారు. మంత్రి ప్రకటన పై కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీలు నిరసనకు దిగాయి. వివిధ విద్యార్ధి సంఘాలు ఇప్పటికే ఆందోళన చేపట్టాయి.
ప్రభుత్వ నిర్ణయం పునః సమీక్షించుకొని వైద్యవిద్యలో పాఠ్యాంశాలు మార్చుకోపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని విపక్ష పార్టీలు హెచ్చరించాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పట్టించుకోవటం లేదని, చమురు ధరలు చరిత్రలో ఎప్పుడు లేనంతగా పెరిగాయని నేతలు విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్ళించేందుకు బిజెపి నేతలు ఈ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని కాంగ్రెస్, బిఎస్పి నేతలు ఆరోపించారు.