టి 20 వరల్డ్ కప్ గెల్చుకుని ముంబై చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పొట్టి ఫార్మాట్ లో జగజ్జేతలుగా నిలిచిన తమ అభిమాన ఆటగాళ్లకు వేలాది జనం నీరాజనాలు పలికారు. ఈ ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తర్వాత ముంబై బయల్దేరిన జట్టు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగి ప్రత్యేక బస్సులో హోటల్ కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం నారీమన్ పాయింట్ వరకూ వచ్చారు. అప్పటికే అక్కడ భారీ జనసందోహం తామ అభిమాన ఆటగాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వారు అక్కడకు చేరుకోగానే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
అక్కడి నుంచి వాంఖేడే స్టేడియం వరకూ ఓపెన్ ఎయిర్ బస్సులో క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య భారీ ఊరేగింపుతో చేరుకున్నారు. ఓవైపు చిరుజల్లుకు కురుస్తున్నా దారిపొడవునా జనం ‘జయహో టీమిండియా’ నినాదాలతో భారత క్రికెటర్ల మీద అభినందల వర్షం కురిపించారు. మరెన్ డ్రైవ్ మీదుగా వాంఖేడే చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను బిసిసిఐ ఘనంగా సన్మానించి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని అందించింది.