వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓటమి నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దాదాపు 45 రోజుల విరామం తర్వాత జరగనున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మీద దృష్టి సారించనుంది. అయితే ఈ సుదీర్ఘ విరామంలో ప్రాక్టీసు కోసం కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాలన్న ఇండియా కోరికపై ఇంగ్లాండ్ బోర్డు నీళ్ళు చల్లింది.
ఇంగ్లాండ్ లో ఫస్ట్ క్లాసు క్రికెట్ ఆడే పలువురు ఆటగాళ్లకు అవసరమైనప్పుడు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నాం తప్ప బయో బబుల్ లో ఉంచడం లేదని అందువల్ల టీమిండియా ప్రాక్టిస్ మ్యాచ్ కు వారు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ఆగష్టు 4 నుంచి ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈలోగా ఒక్కొక్కటి నాలుగు రోజులపాటు జరిగే ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ లు రెండు మాత్రమే జరిగే అవకాశం ఉందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
సౌతాంప్టన్ నుంచి లండన్ చేరుకున్న ఇండియా జట్టు జూలై 14 తర్వాత దుర్హం చేరుకొని అక్కడి నదీతీరంలో ఉన్న మైదానంలో ఈ మ్యాచ్ లు ప్రాక్టీస్ చేయనుంది.
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు కనీసం రెండైనా ఫస్ట్ క్లాసు మ్యాచ్ లు ఆడే అవకాశం లేకపోవడం పట్ల టీమిండియా సారధి విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు.