Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Maa President Naresh Explained His Committee Efforts For The Last Two Years :

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇంకా మూడు నెలల టైమ్ ఉంది కానీ.. ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టడంతో ఈసారి ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరగనున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నిన్న ప్రకాష్‌ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తన ప్యానల్ ని పరిచయం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ఠ మసకబారింది అని కామెంట్ చేశారు. అయితే.. ఈరోజు మా అధ్యక్షుడు నరేష్, జీవిత కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాని ఆహ్వానించారు. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రెస్ మీట్ కి జీవితా రాజశేఖర్ దూరంగా ఉన్నారు. అయితే.. తను మా ఎన్నికల బరిలో ఉన్నట్టు మీడియాకి సమాచారం అందించారు.

మీడియా సమావేశంలో మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ… ‘గతంలో జయసుధ గారు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నువ్వు ఉండాలి అన్నప్పుడు నేను ఉన్నాను. అప్పుడు మా ప్యానల్ గెలిచింది కానీ.. అధ్యక్షురాలిగా జయసుధ ఓడిపోయారు. నేను మా అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ ఛైర్మెన్ గా పనిచేశాను, ఇప్పుడు అధ్యక్షుడుగా పని చేస్తున్నాను. ‘మా’ తో నా ప్రయాణం ఆరు సంవత్సరాలు. నేను ప్రజాస్వామ్యబద్దంగా అత్యధిక ఓట్లతో గెలిచాను. ఒక మంచి ఉద్దేశ్యంతో ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టాను. సంస్థలో సమస్య ఎప్పుడు వచ్చినా.. నేను ఎప్పుడూ ముందు ఉన్నాను. నరేష్ కలుపుకుని పోలేదు అని కొంత మంది అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది వాళ్లకే తెలియాలి’ అని వ్యాఖ్యానించారు.

‘ప్రకాష్ రాజ్ గారు నాకు మంచి మిత్రుడు. 3 నెలల క్రిత ఫోన్ చేసి ఈసారి ‘మా’ అధ్యక్షుడుగా పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అన్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ అయిన వాళ్లు ఎవరైనా.. ఏ పోస్ట్ కి అయినా పోటీ చేయచ్చు. ‘మా’ అధ్యక్షుడుగా ఎవర్ని ఎన్నుకోవాలి అనేది నిర్ణయించేది ఓటర్స్ అని చెప్పడం జరిగింది. మంచు కుటుంబం లాభనష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల.. వేల మందికి అన్నం పెట్టారు. మంచు విష్ణు కూడా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్నారు. నేను ఎవరొచ్చినా స్వాగతిస్తాను. నేను ‘మా’ అధ్యక్షుడుగా గెలిచినప్పుడు నేను ఒకసారే అధ్యక్షుడుగా ఉంటానని, రెండోసారి పోటీ చేయననని చెప్పాను’ అని వివరించారు.

‘ఇది రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతో మంది పెద్దలు చిరంజీవి గారు, మోహన్ బాబాబు గారు, దాసరి గారు, కృష్ణ గారు , కృష్ణంరాజు గారు.. ఇలా ఎంతో మంది పెద్దలు తెలుగు సినిమా వాళ్లకు ఓ గొడుగు ఉండాలని ఈ సంస్థను పెట్టారు. కాబట్టి ఎవరొచ్చినా సంతోషం. నిన్న ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో నాగబాబు గారు మాట్లాడుతూ… నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ఠ మసకబారింది అనడం చూసి షాక్ అయ్యాను. రెండు సంవత్సరాల్లో ఏం చేశామనేది డైరీలో పొందుపరచడం జరిగింది. ఈ వివరాలను మీడియాకి అందిస్తాను. ఆయన అలా మాట్లాడడం సంస్థను కించపరచడమే. ఇక లోకల్, నాన్ లోకల్ అని మేము అనలేదు. ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాను. మా లో 914 లైఫ్ మెంబర్స్ ఉన్నారు. వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశాను, దానికి చైర్మన్ గా ఉన్నాను. ఆపదలో ఉన్న 48 మందికి దాదాపు 50 లక్షలు అందించాం. 314 సభ్యులకు మెడికల్ గా రక్షణ ఇచ్చాం. ఇది విజన్ కాదా. ఇది ‘మా’ చరిత్రలో హిస్టరీ. కరోనా టైమ్ లో 96 లక్షలు మా సభ్యులకు ఇవ్వడం జరిగింది. నేను 10 మందిని దత్తత తీసుకుంటున్నాను. మా భవనానికి మా వంతు తోడ్పాటు అందిస్తాం’ అని నరేష్ తెలియ జేశారు.

Must Read : మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం : మంచు విష్ణు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com