తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించాక మంత్రివర్గ కూర్పుపై సుదీర్గ కసరత్తు జరిగింది. కష్ట కాలంలో పార్టీకి సేవలు అందించిన వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. పార్టీ విధేయత, సీనియారిటి, సమర్థత, సామాజిక వర్గాల ఆధారంగా మంత్రులుగా అవకాశం కల్పించారు. మంత్రులుగా ఎంపిక చేసిన వారికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే పోనే చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు.
మల్లు భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. తెలంగాణ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి పదవి ఏర్పాటు చేయగా అది భట్టికి ఇచ్చారు.
మంత్రివర్గంలోకి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు అవకాశం ఇచ్చారు. ఇద్దరు నేతలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించారు. జిల్లాలో కాంగ్రెస్ నుంచి నేతలు వరుసగా పార్టీని వీడుతున్నా వీరిద్దరు హస్తం పార్టీకి అండగా నిలిచారు. ఇద్దరు నేతలకు అవకాశం ఇవ్వటంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహకు మంత్రి పదవి దక్కింది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజ నరసింహ పార్టీలోనే కొనసాగినా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అంతగా నిర్వహించలేదు. జగ్గారెడ్డి ఓటమి, జిల్లాలో మరో నేత లేకపోవటం, సామజిక వర్గాల తూకంలో రాజ నరసింహకు కలిసివచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఛాన్స్ ఇస్తారని ముందు నుంచే అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత ఆ పార్టీ నేతలు జూపల్లిని పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా కాంగ్రెస్ నుంచి గెలిచినా హరవర్ధాన్ రెడ్డి
నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. జిల్లాలో సీనియర్ నేతలు కావటం..మొదటి నుంచి బీఆర్ఎస్ వైపల్యాలను ఎత్తిచూపుతూ పార్టీ మనుగడ సాగించేలా ఇద్దరు నేతలు వ్యవహరించారు. అంతర్గతంగా వైరుధ్యాలు ఉన్నా స్థూలంగా పార్టీ కోసం పని చేసిన అనుభవం ఇద్దరికి మంత్రి పదవులు దక్కతంపై అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ఇస్తారని మొదటి నుంచి అనుకుంటున్నదే. సామాజిక వర్గాల పరంగా కమ్మ వర్గం నుంచి గెలిచిన ఒకే నేత, రాజకీయ అనుభవం, ముక్కుసూటితనం తుమ్మలకు కలిసి వచ్చింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు చేకూర్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… బీఆర్ఎస్ ను ఓడించి తీరుతానని శపథం చేసి నిరూపించారు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచి అన్ని రకాలుగా పొంగులేటి ఆదుకున్నారు.
వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలను మంత్రి పదవులు వరించాయి. సీతక్కకు మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి పార్టీ వర్గాలు చెప్పుకున్తున్నదే. ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో సీతక్క…రేవంత్ రెడ్డికి అన్ని వేళలా అండగా నిలిచారు. సీతక్క తనదైన శైలిలో సీతక్క ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ గీత దాటకుండా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
బిసీ, మహిళా కోటాలో కొండ సురేఖకు మంత్రి పదవి ఇచ్చారని తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాక కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సంచలనం సృష్టించారు. జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఉన్న వైరం నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలంటే కొండా సురేఖకు అమాత్య పదవి ఇవ్వాల్సిందే అనే చర్చ జరిగింది.
రంగారెడ్డి జిల్లా కోటాలో స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖారారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ కు రెండో విడతలో అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరున్న గడ్డం వినోద్ కు ఇస్తే వినోద్, వివేక్ సోదరులకు స్థానం కల్పించినట్టు అవుతుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి కార్యకర్తలకు అండగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎదురొడ్డి నిలిచారు. రెండో దఫా విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తారని తెలిసింది.
-దేశవేని భాస్కర్