ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాని, హీరో అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉదయం కూల్చివేత ప్రక్రియ మొదలైన వెంటనే నాగార్జున దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనది ఆక్రమణ కాదని, పట్టా ల్యాండ్ ను కొనుగోలు చేసి నిర్మించామని… గతంలో కూడా ప్రభుత్వం దీనిపై చర్యలకు ఉపక్రమించినప్పుడు గౌరవ న్యాయస్థానం స్టే ఇచ్చిందని నాగార్జున తరఫు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. నేడు కూడా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత మొదలు పెట్టారని బెంచ్ కు విన్నవించారు.
మరోవైపు, గతంలో ఎలాంటి స్టే ఇవ్వలేదని, ఆక్రమణ అని తేలితే చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ హైడ్రా చర్యలపై స్టే విధిస్తూ తీర్పు చెప్పారు.
అయితే ఈ తీర్పు వచ్చే నాటికే సెంటర్ ను అధికారులు భారీ బుల్డోజర్ల సాయంతో నేలమట్టం చేశారు. దీనితో హైకోర్టు స్టే ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.