హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మృతివనం పనులు తుది దశకు చేరుకొన్నాయి. స్మృతివనంలో అత్యంత కీలకమైన జ్వలించే దీపం నిర్మాణంతో మొత్తం పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన ప్రమిదకు ఫినిషింగ్‌తో పాటు జ్వలించే దీపం ఏర్పాటు కోసం దుబాయ్‌ నుంచి దాదాపు రూ.38 కోట్ల ఖర్చుతో 3,800 చదరపు మీటర్ల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను తెప్పిస్తున్నారు.

దీనిని అమరుల స్మృతి వనంకు కావల్సిన రీతిలో దుబాయ్‌లోనే డిజైన్‌ చేయించి, 40 కంటైనర్లలో రప్పిస్తున్నారు. దుబాయ్‌ నుంచి ముంబై పోర్టు ద్వారా ఇప్పటికే మూడు కంటైనర్ల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ హైదరాబాద్‌కు చేరుకొన్నది. దీనిని స్మృతివనం భవనానికి అమర్చేందుకు దుబాయ్‌ నుంచి 20 మంది నిపుణులు వచ్చారు. వచ్చిన స్టీల్‌ను వచ్చినట్టుగానే ఫిటింగ్‌ చేస్తున్నారు.

దీంతోపాటు మిగిలిన చిన్నచిన్న పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం స్టీల్‌ హైదరాబాద్‌కు చేరుకోవడానికి మరో మూడున్నర నెలలు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. చివరి కంటైనర్‌ వచ్చిన తరువాత 15 రోజుల్లోనే ఫిటింగ్‌ పూర్తవుతుందని అంచనా. ఇతర ఫినిషింగ్‌ పనులన్నీ కలుపుకొని ఐదారు నెలల్లోనే స్మృతివనం ప్రారంభానికి సిద్ధమవుతుందని అధికారులు చెప్తున్నారు. అమరవీరుల స్మృతి వనంకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను జ్వలించే దీపం మాదిరిగా డిజైన్‌ చేశారు. దీపానికి మిర్రర్‌ పాలిష్‌ చేయనున్నారు. దీంతో 24 గంటలూ దీపం వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *