Tuesday, April 16, 2024
HomeTrending Newsతెలంగాణ ఏర్పడిన వేళ...

తెలంగాణ ఏర్పడిన వేళ…

Telangana Movement : జూన్ 2… తెలంగాణకు ప్రత్యేకం. సమైక్యాంధ్రప్రదేశ్ కాస్తా… రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి… అస్తిత్వం కోసం జరిగిన కొట్లాటకు ఓ తుదిరూపం. 60ల నుంచే మొదలైన ఓ ఉద్యమ కార్యాచరణకు చిట్టచివరి ఓ సానుకూల ఫలితం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకునేవారు… తెచ్చామని చెప్పుకునేవారు… తమ ప్రమేయం లేకుండా రాష్ట్ర ఏర్పాటే సాధ్యం కాదని చెప్పుకునేవారు… అప్పటివరకూ రెండుకళ్ల సిద్ధాంతమనే డిప్లమసీతో వ్యవహరించి ఆ తర్వాత తామే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణమనేవారు… ఇలా రాజకీయాలు సర్వసాధారణం. అయితే ఎవరి పీరియడ్ లో అది సాధించారన్నదే చరిత్రలో ఓ కీలకఘట్టం.

అదిగో ఆ కీలకఘట్టంలో… ప్రధాన పాత్రధారి ఇవాల్టి ముఖ్యమంత్రి కేసీఆర్! ఇప్పుడాయన ముఖ్యమంత్రి… తెలంగాణలో తిరుగులేని నేత… 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని నామారూపాల్లేకుండా చేసి హుస్సేన్ సాగర్ లో విసిరేసిన బక్కపల్చని బలవంతుడు… కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ.. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి… తెలంగాణలో మాత్రం తనను ఎదుర్కొనే వ్యూహంలో ఓ గ్రిప్ దొరకక సతమవుతున్న మరో జాతీయపార్టీ బీజేపికి దిక్కుతోచకుండా చేస్తూ… ఏకంగా కేంద్రంలోనూ చక్రం తిప్పుతానని బయల్దేరిన సమర్థుడు… ఇలా ఎన్నో రకాల విశ్లేషణలకు కేసీఆర్ ఒక రూపు!

ఆయన ఉన్న స్థానానికి ఆయన గురించి పడినవాళ్లు, పడనివాళ్లు… ఆయా సందర్భాల్లో రాసేవి… రాస్తున్నవి.. రాయబోయేవి ఏవైనా ఉండొచ్చుగాక. సందర్భం వచ్చిన ప్రతీసారీ తమ శైలితో జనాన్ని కట్టిపడేసేలా చదివించే మహామహులైన సీనియర్ విశ్లేషకులు, జర్నలిస్టులు ఇప్పుడుకూడా రాయొచ్చుగాక.. అందులోనూ పొగడ్తలతో ముంచెత్తొచ్చుగాక! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పుడిక్కడ రాస్తున్నదీ ఓ పొగడ్తలానే కనిపించొచ్చుగాక! కానీ, పొగడ్త అనుకుంటారని నిజాల్ని రాయకపోవడం కూడా సరైంది కాదేమో బహుశా! అందుకే కొన్ని చెప్పుకోవడానికి జూన్ 2 ఓ సందర్భం!!

అది మెదక్ జిల్లాలో ఓ ప్రముఖ ఛానల్ లో నేను పనిచేస్తున్న పీక్ ఉద్యమకాలం! కేవలం టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న ఛానల్ తో పాటు.. ఒకటో, రెండో కాస్తోకూస్తో మద్దతందిస్తున్న సమయమది. మిగిలిన ఛానల్స్ లో కొన్ని ఉన్నదున్నట్టు చూపిస్తే… మరికొన్ని తెలంగాణపై విద్వేషాన్నెంత కక్కాయో చెప్పడానికి ఉద్యమ చరిత్ర కాలమే ఓ సజీవ సాక్ష్యం! ఆ సమయంలో ఉన్నదున్నట్టుగా చూపించిన ఛానల్స్ ను కూడా తెలంగాణ రాజకీయ పక్షాలు వ్యతిరేకశక్తులుగానే చూడటం… అంతకుమించి తమ రాజకీయపబ్బం కోసం అలాగే ప్రచారం చేయడం వంటివన్నీ ఇప్పటికీ కళ్లముందు కదిలేవే!

ప్రధాన ఛానల్ లో జిల్లా కరస్పాండెంట్ గా ఉద్యోగం… పీక్ స్థాయిలో నడిచే ఉద్యమం… ఇంకేం అప్పటి మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి సిద్ధిపేటకు ఠికాణా మారింది. చేతిలో లైవ్ వ్యాన్. ఇప్పుడు పాలకపక్షంలో కీలకపాత్రధారైన మంత్రి చొరవతోనే హరిహర రిసార్ట్స్ లో ఓ పెద్ద లంకంత గది దొరికింది. నాతో పాటు ఇద్దరు కెమెరాపర్సన్స్, మినీవ్యాన్ డ్రైవర్, డీఎస్ఎన్జీ వ్యాన్ డ్రైవర్, టెక్నీషియన్… ఇలా ఓ బృందమంతా… 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టందేకు సమాయత్తం చేసిన సభాస్థలికి కూతవేటు దూరంలో ఔట్ కట్స్ లో ఉన్న రిసార్ట్స్ లోనే ఉనికి.

అప్పుడు ఉద్యమం కాస్త తీవ్రతరమైన సమయంలో… ఇప్పటి ఆర్టీసి ఎండీ, అప్పుడు కౌంటర్ ఇంటలిజెన్స్ లో పనిచేస్తున్న సజ్జనార్ ను మెదక్ జిల్లా ఎస్పీగా నియమించారు. తెల్లార్లేస్తే ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు, ఆందోళనలు ఇలా సాగాయా రోజులు. ఎక్కడ చూసినా నివురుగప్పిన నిప్పులాంటి వాతావరణంలో… ఎప్పుడు బందుకు పిలుపునిస్తారో అర్థం కాని అయోమయంలో.. భోజనం దొరకడం గగనగండం. అప్పుడప్పుడూ ఔట్ కట్స్ లో ఉండే దాబాలు తెరిస్తే మెల్లిగా వెళ్లి తినిరావడమే తప్ప.. ప్రాపర్ గా భోజనం దొరకని దయనీయ స్థితి. ఆ సమయంలో సిద్ధిపేట స్ట్రింగర్ గా ఉన్న మిత్రుడి సహకారం, అప్పటి కౌన్సిలర్ సాయం.. ఇవన్నీ ఎప్పటికీ చెప్పుకోవాల్సిన గురుత్వం తాలూకు ప్రధానాంశాలు. సిద్ధిపేటకు బయల్దేరిన కేసీఆర్ ను కరీంనగర్ లో అరెస్ట్ చేయడం.. ఖమ్మంలో నెలకొన్న హైడ్రామా… సిద్ధిపేటలో మంత్రి హరీష్ పెట్రోల్ పోసుకోవడం వంటి సంఘటనలన్నీ చరిత్రెరిగిన వారికి మళ్లీ చెప్పడమంటే చర్విత చరణమే! అయితే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారో కూడా ఆ ఉద్యమ వేదిక కళ్లకు కట్టింది. మహేష్ చంద్ర లడ్డా లాంటివాళ్లు బుల్లెట్ ప్రూఫ్ వస్త్రాలతో ఆన్ ఫీల్డ్ సైనికుల్లా సిద్ధిపేట ఉద్యమస్థలిలో కావలి కాసిన రోజులవి. ఆంధ్రఛానల్స్ అన్న పేరుతో… పనిచేస్తున్నవారు ఏ ప్రాంతంవారన్న సోయి మర్చి మాపై కొందరు ఉద్యమకారుల ముసుగులో ఆందోళనకారులు దాడులకూ ప్లాన్ చేసిన వేళలవి. అప్పటికే కొన్ని డీఎస్ఎన్జీ లైవ్ వెహికిల్స్ కి నిప్పంటించిన ఘటనలూ కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. కానీ, అన్నింటినీ పంటివెనుక బిగపట్టి… వాటన్నింటినీ హెడ్ ఆఫీస్ కు చెప్పలేక, అంత కీలక ఉద్యమ సమయంలో అస్త్రసన్యాసం చేయడం.. కనీసం సవాళ్లనెదుర్కోలేని పిరికితనమని భావించి.. అపసోపాలతో కవరేజ్ ఇచ్చిన కాలమది.

డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమపోరాటానికి తుదిరూపని అంతా భావించిన రోజు. సరిగ్గా ఆరోజు రాత్రి… తెలంగాణ ఇస్తున్నట్టు నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని హోంమంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన.. యావత్ తెలంగాణలో హర్షాన్ని నింపింది. అప్పటికే రాజకీయమేదో, ఉద్యమమేదో తెలియని భావోద్వేగాలతో వందల మంది బిడ్డలు అమరులై… ఆ కుటుంబాల్లో దు:ఖాన్ని నింపి వెళ్లిపోయిన వారి త్యాగాలకైనా ఫలితం దక్కింది.. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కరుణించిందనుకున్న రోజది. నాకు ఏదో పర్సనల్ పని పడి ఆఫీస్ కు చెప్పి… సరిగ్గా డిసెంబర్ 9 రాత్రి హైదరాబాద్ వెళ్తున్నానో, లేదో బస్సులో ఉన్న నాకు.. తెలంగాణ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమం గురించి తెలిసింది. అయితే ఆతర్వాత ఛానల్స్, పత్రికలు, మీడియా ఫోకస్ అంతా… సమైక్యాంధ్ర ఉద్యమం వైపు మళ్లింది. తెలంగాణ ఉద్యమంలో సొంత అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంలో కనిపించని పాజిటివిటీని పట్టిచూపించిన చరిత్ర నాడు మీడియా సొంతం. మొత్తంగా ఆ తర్వాత ఐదేళ్లపాటు మరోసారి గట్టి పోరాటమనంతరం… ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడి… 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం జరగడం… భారత చరిత్రలోనే ఓ విశిష్ఠాధ్యాయం.

అయితే ఆ ఉద్యమంలో ఎందరో సమిధలయ్యారు. ఇంకెందరో తోడు నిల్చారు. మరెందరో పోరాడారు. చాలామంది ప్రాణాలనే ఫణంగా పెట్టారు. ఓవైపు ప్రజాక్షేత్రంలో… ఇంకోవైపు చట్టసభల్లో మార్మోగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల నిజమైంది. ఇచ్చింది మేమేనని ఎవరెన్ని చెప్పుకున్నా… మా మద్దతు వల్లే తెలంగాణ సాకారమైందని ఎవరు చంకలు గుద్దుకున్నా.. అనుకూలమూ కాదు, ప్రతికూలమూ కాదంటూ గోపీల్లా ఎందరో వ్యవహరించినా… మొత్తంగా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేలాగా ఓ పర్యాయపదమై కూర్చున్న నాయకుడు మాత్రం ముమ్మాటికీ కల్వకుంట్ల చంద్రశేఖరుడే! దాన్ని సొంతం చేసుకోవడంలో పార్టీలు విఫలమైనాయా… కేసీఆర్ సక్సెసయ్యాడా అన్నవి పరిశీలించినప్పుడు ప్రత్యర్థి బలహీనతే.. విజేత బలం… అదే కేసీఆర్ తనకనుకూలంగా ఎప్పటికప్పుడు మల్చుకోవడంలోని రాజకీయ చాణక్యం! అందుకే ఉద్యమ పోరాటస్ఫూర్తితో సాకారమైన తెలంగాణ ఎంత నిజమో… కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అనేది అంత నిజం!!వర్తమానంలో ఎన్నో నేత్రాలు కళ్లారా చూసిన ఉద్యమపోరాటం తెలంగాణ మూమెంట్! రేపటి భవిష్యత్ తరాలకు చరిత్రలోని ఓ ముఖ్యమైన పేజీ!! నాబోటి జర్నలిస్టులకు మరపురాని.. మర్చిపోలేని ఓ పుట.

-రమణ కొంటికర్ల

Also Read : తెలంగాణ ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్