Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో 'పీకే' ది ఎవరు!

తెలంగాణలో ‘పీకే’ ది ఎవరు!

Politics : ప్రశాంత్ కిషోర్…ఇప్పుడు దేశ రాజకీయాల్లో అందరి నోట పీకే గా వినపడుతున్న మాట. రాజకీయ చాణక్యుడిగా, అపర వ్యూహకర్తగా దేశ రాజకీయాలను మలుపు తిప్పే పనిలో ఉన్నారు ఈయన. ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీని ఎంచుకొని, అదే ఆ పార్టీతో డీల్ కుదుర్చుకుని, అంతా తానై వెనకుండి నడిపించి ఎన్నికల్లో విజయం సాధించి పెట్టటం పీకే పని. మొదటగా గుజరాత్ లో మోడీ విజయానికి కృషిచేసి, మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బీజేపీకి దూరంగా జరిగి ప్రాంతీయ పార్టీల గెలుపులో కీలక భూమిక పోషిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో మమత విజయం వెనుక, అలాగే తమిళనాడులో స్టాలిన్ విజయం వెనుక , ఏపీలో జగన్ గెలుపు వెనుక పీకే టీం వ్యూహం కీలకమైంది. పూర్తి రాజకీయాల్లోకి వస్తూ 2020లో జేడీయూలో చేరిన పీకే ఆ పార్టీ వైఖరిని విభేదించి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

అది సరే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహమేంటి … బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన నిలిచి కాంగ్రెస్ కూటమి 2024 లక్ష్యంగా ముందుకు వురికిస్తారా… లేక కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నేతగా ఆ పార్టీని అధికారంలోకి తెచ్చే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమవుతారా అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ఏకంగా నాలుగు గంటల పాటు సమావేశం అవడం, 2024 కు కాంగ్రెస్ ఏమి చేస్తే విజయం సాధిస్తుందో రోడ్డుమ్యాప్ ఇవ్వటం,దానిపై కాంగ్రెస్ కమిటీ వేసి కసరత్తు ప్రారంభించటం ఇప్పుడు తాజా రాజకీయం. పనిలో పనిగా ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీలో చేరమని సోనియా ఇతర నేతలు ఈ సమావేశంలోనే ఆహ్వానించటం జరిగిపోయింది. సానుకూల స్పందన పీకే నుంచి వచ్చిందని ఇంకో వారంలో దానిపై ఒక క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలే చెప్పుకొచ్చారు. అదే జరిగితే ఇక పీకే వ్యూహం అంతా కాంగ్రెస్ గెలుపు కోసమే అవుతుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయి. ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం వ్యూహాలు ఇప్పటి నుంచే రచిస్తున్న టీఆర్ఎస్ అందుకోసం ప్రశాంత్ కిషోర్ సలహాలను తీసుకుంటోంది. “అవును పీకే సలహాల మేరకే నడుస్తున్నాం. ప్రశాంత్ కిషోర్ నాకు ఎంతో సన్నిహితుడు ఆయన సలహాలు సూచనలు తీసుకుంటే తప్పేంటి ” అంటూ స్వయంగా టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పీకే టీం సర్వే చేసిందని ఆ నివేదికను కేసీఆర్ కు ఇచ్చిందని చెబుతున్నారు. అంటే టిఆర్ఎస్ పార్టీ మరోమారు విజయం కోసం ప్రశాంత్ కిషోర్ ను తమ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తేటతెల్లమవుతోంది.

ఇప్పుడు తెలంగాణలో పీకే టీం టిఆర్ఎస్ కోసం పని చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ గూటికి చేరితే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడుతుందా? కాంగ్రెస్ తో ప్రశాంత్ కిషోర్ కు డీల్ కుదిరితే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఏం చేస్తారు? మధ్యలోనే కాడి దించేసిన ఎద్దులాగా టిఆర్ఎస్ ను నట్టేట ముంచుతారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. లేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరు అన్న రీతిలో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తారా ? అన్నది వేచి చూడాలి. బీజేపీ వ్యతిరేక కూటమిని కాంగ్రెస్ తయారు చేస్తే అందులో టిఆర్ఎస్ కలవటం అంత సులువు కాదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ ఎన్నికల్లో అయినా ప్రజల మనసు గెలుచుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఆ దిశగా చురుకుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకి వ్యూహ‌క‌ర్త‌గా సునీల్ నియమితులయ్యారు. సునీల్ కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ లో గతంలో పనిచేసిన వ్యక్తి కావటంతో సునీల్ టీం ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించింది. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశానికి హాజ‌రైన సునీల్ అత‌డి బృందం, స‌మావేశంలో ప్ర‌తి నేత లేవ‌నెత్తిన అంశాల‌ను నోట్ చేసుకున్నారు. జిల్లాల వారీగా తమ బృందాన్ని రంగంలో దింపారు. మరోపక్క తెలంగాణ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం టీ-కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇస్తూనే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించాలని చేస్తోంది. దూకుడు పెంచిన టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో రాహుల్ పర్యటనను ఖరారు చేసుకున్నారు. మే 6 ,7 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటన, వరంగల్లో సభ ఖరారు కాగా, భారీ జన సమీకరణపైనా కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టారు.

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా దూసుకుపోతున్న బిజెపి, దూకుడు పెంచిన కాంగ్రెస్ లను కాచుకుంటూ అధికార టీఆర్ఎస్ ఏం చేయబోతోంది. ప్రశాంత్ కిషోర్ సూచనలు వ్యూహాలతో ముందుకు వెళదామని భావించిన టీఆర్ఎస్, పీకే కనుక హ్యాండ్ ఇస్తే ఏం చేయబోతోందన్నది వేచి చూడాలి.

-వెలది కృష్ణ కుమార్

Also Watch :

RELATED ARTICLES

Most Popular

న్యూస్