తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ అన్నారు. ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2022 ’ , ‘తెలంగాణ రాష్ట్ర గణాంక సంక్లిష్ట నివేదిక – 2022 ’,తెలుగు అనువాద ప్రచురణలను వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రచురణల్లో తెలంగాణ ఆర్థిక పురోగతి అంశాలు, వివిధ రంగాల, శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, గణాంకాలు సమగ్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రచురణను విద్యార్థులు అనుసరించి వివిధ పోటీ పరీక్షలలో మెరుగైన ఫలితాలను సాధించి ముందుకు సాగాలని వినోద్ కుమార్ సూచించారు. ఖరీదైన ఈ ప్రచురణలు సబ్సిడీతో విద్యార్థులకు ప్రణాళిక శాఖ అందజేయనుందని పేర్కొన్నారు. ఈ ప్రచురణలు రాష్ట్రంలోని న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయాలలో, లైబ్రరీలలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ క్రింది వెబ్ సైట్లలో కూడా సాఫ్ట్ కాపీలను అందుబాటులో ఉంచినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ క్రింది వెబ్ సైట్లలో కూడా సాఫ్ట్ కాపీలను అందుబాటులో ఉంచినట్లు వినోద్ కుమార్ తెలిపారు.
www.telangana.gov.in
www.tsdps.telangana.gov.in
www.ecostat.telangana.gov.in
మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, ఉప గణాంక అధికారి పీ. ముకుంద రెడ్డి, రాష్ట్ర అర్థ గణాంక శాఖ డైరెక్టర్ జి. దయానంద్, తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కే. ముత్యంరెడ్డి, అర్థ గణాంక శాఖ అధికారులు రామకృష్ణ, రామభద్రం, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.