Friday, April 19, 2024
HomeTrending Newsరష్యా పెట్రో దిగుమతులపై భారత్ ఘాటైన స్పందన

రష్యా పెట్రో దిగుమతులపై భారత్ ఘాటైన స్పందన

భారత అవసరాల దృష్ట్యా రష్యా నుంచి పెట్రో దిగుమతులు చేసుకోవటంలో ఎలాంటి తప్పు లేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తేల్చి చెప్పారు.  కొన్ని దేశాలు రష్యా నుంచి పెట్రో దిగుమతుల్ని భూతద్దంలో చూపెడుతూ భారత్ ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరోపు పర్యటనలో ఉన్న జై శంకర్ స్లోవేకియా రాజధాని బ్రటిస్లావాలో జరుగుతున్న ఇండో పసిఫిక్ ప్రాంత సహకారంపై జరుగుతున్న  సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో పశ్చిమ దేశాలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కర్ర కాల్చి వాత పెట్టినట్టుగా బదులిచ్చారు. చమురు కోసం భారత్ చెల్లించే డబ్బుతోనే రష్యా యుద్దానికి దిగుతోంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత డబ్బులతో రష్యా కనుక యుద్ధం చేస్తే యూరోప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ డబ్బులు రష్యా దేనికి వాడుతోందని అడిగారు.

యూరోప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటే తప్పు లేనిది… ఇండియా పెట్రోలు దిగుమతి చేసుకుంటే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలపై ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ప్రభావం చూపుతోందని ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నాయని జై శంకర్ గుర్తు చేశారు. ఆంక్షల పేరుతో రష్యా నుంచి ఎగుమతులు ఆపినపుడు ఇరాన్ , వేనిజువేలా దేశాల నుంచి పెట్రో ఎగుమతులను ప్రపంచ మార్కెట్లకు ఎందుకు అనుమతించటం లేదని( పరోక్షంగా అమెరికా, నాటో దేశాల వైఖరిని) ప్రశ్నించారు.

కోవిడ్ తో అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని జై శంకర్ అన్నారు. కరోనా నుంచి విజయవంతంగా బయటపడిన ఇండియా ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసే దిశగా పనిచేస్తోందన్నారు.  అమెరికా, యూరోప్ సహా పశ్చిమ దేశాలు ఆయా దేశాల ప్రయోజనాలు, ప్రజల కోణం నుంచి మాత్రమె రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని చూస్తున్నాయని మిగతా వారి గురించి ఆలోచించటం లేదని జై శంకర్ ఘాటుగా స్పందించారు. జూన్ రెండు నుంచి ఆరో తేది వరకు స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.

Also Read విదేశాంగ విధానానికి జై శంకర్ కొత్త భాష్యం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్