Saturday, January 18, 2025
Homeసినిమాహాస్యానికి వన్నె తెచ్చిన నటుడు రమణారెడ్డి

హాస్యానికి వన్నె తెచ్చిన నటుడు రమణారెడ్డి

Telugu Cinema History Ramana Reddy Comedy Is Unforgettable Forever :

తెలుగు తెరపై సందడి చేసిన తొలితరం హాస్య నటుల్లో రమణారెడ్డి ఒకరు. తెరపై నెల్లూరు యాసకు ఒక గుర్తింపును తీసుకొచ్చినవారాయన. ‘ఎట్టా .. ఎట్టెట్టా?’ అంటూ నవ్వులను పరవళ్లు తొక్కించినవారాయన. అప్పట్లో తెరపై రేలంగి – రమణా రెడ్డి సమకాలికులు. కలిసి కామెడీని పరుగులు తీయించిన జంట. లావుగా ఉన్న రేలంగి ఎంతమాత్రం కదలకుండా నవ్విస్తే .. బక్కపలచగా ఉన్న రమణా రెడ్డి బొంగరంలా గిర్రున తిరుగుతూ .. దభాలున కుప్పకూలిపోతూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హాస్యాన్ని పండించడంలో ఆయన చూపించిన ప్రత్యేకతనే ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి కారణం.

రమణా రెడ్డి పూర్తిపేరు .. తిక్కవరపు వెంకటరమణా రెడ్డి. రేలంగి ఇంటిపేరుతో పాప్యులర్ అయితే, రమణా రెడ్డి తన ఇంటిపేరు ప్రస్తావన లేకుండానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇద్దరి పేరులోను ‘వెంకట’ అని ఉండటం మరో విశేషంగా కనిపిస్తుంది .. అనిపిస్తుంది. రమణా రెడ్డి నెల్లూరు యాసలోనే మాట్లాడేవారు కనుక, ఆయన నెల్లూరుకు చెందినవారని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నెల్లూరు పరిధిలోని ‘జగదేవపేట’ గ్రామానికి చెందిన ఆయన,  మొదటి నుంచి కూడా బల్లపలచగానే ఉండేవారు. నెల్లూరు ప్రాంతం నుంచి సినిమా ఫీల్డ్ కి వెళ్లిన తొలితరం నటుల్లో ఆయన ఒకరు.

కాలేజ్ చదువుకి వచ్చేసరికి ఆయనకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ పోయింది. స్నేహితులతో కలిసి కొన్ని నాటకాలు కూడా వేశారు. ఆ తరువాత శానిటరీ ఇన్స్పెక్టర్ గా నెల్లూరులోనే ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆయన మనసు మాత్రం ఉద్యోగం మీద కాకుండా నటనవైపుకు లాగడం మొదలుపెట్టింది. ఒక చోట ఉంటూ మరో చోట ప్రయత్నాలు చేయడం కుదరదని భావించిన ఆయన, ఇక కష్టమైనా .. నష్టమైనా ఇష్టమైన చోటునే పడదామనే ఉద్దేశంతో మద్రాసుకు చేరుకున్నారు. అక్కడ ఒక రూమ్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు.

రమణారెడ్డి తెరపై ఉన్నట్టుగా చలాకీగా .. గడసారిగా బయట ఉండరు. బయట ఆయన చాలా మితభాషి. అందువలన ఎవరూ కూడా ఆయనకి ఒక వేషం ఇస్తే బాగా నవ్విస్తాడని అనుకోలేదు. అలా మొత్తానికి తన ప్రయత్నాలు ఫలించి, చిన్న చిన్న వేషాలను సంపాదించుకుంటూ ముందుకు వెళ్లసాగారు. అలా ఆయన గురించి అందరికీ ఒక స్పష్టమైన అవగాహన వచ్చేలా చేసిన సినిమాలుగా ‘బంగారు పాప’ .. ‘మిస్సమ్మ’ కనిపిస్తాయి. ముఖ్యంగా ‘మిస్సమ్మ’లో ప్రేమిస్తున్నానంటూ ఒక పువ్వు పట్టుకుని సావిత్రి వెంటపడే పాత్ర అప్పుడే కాదు .. ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.

ఇక ‘మిస్సమ్మ’ నుంచి కెరియర్ పరంగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అటు గ్రామీణ నేపథ్యంలోని పాత్రలు .. ఇటు పట్నం నేపథ్యంలోని పాత్రలను ఆయన అద్భుతంగా పోషించడం మొదలుపెట్టారు. బక్కపలచని ఆయన రూపం .. నెల్లూరు యాస .. కాళ్లు .. భుజాలు ఎగరేస్తూ నడిచే తీరు .. కామెడీలోనే కన్నింగు చేసే విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక అప్పట్లో ఆయనకి భార్యగా సూర్యకాంతం .. కూతురుగా గిరిజ .. అల్లుడుగా రేలంగి కాంబినేషన్ సీన్స్ థియేటర్లను నవ్వుల నావలా మార్చేవి. 

మామకి మస్కా కొట్టే అల్లుడి పాత్రలో రేలంగి రెచ్చిపోతే, అల్లుడి పథకాలకు గండికొట్టే మామగా రమణా రెడ్డి చెలరేగిపోయేవారు. ఒకానొక దశలో రేలంగి – రమణా రెడ్డి లేని సినిమా అంటూ ఉండేది కాదు. వాళ్లిద్దరూ పోస్టర్ పై కనిపిస్తే చాలు .. జనాలు ఆ సినిమాకి వెళ్లిపోయేవారు. అప్పటి రచయితలు కూడా రమణా రెడ్డి బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా డైలాగ్స్ రాసేవారు. ముఖ్యంగా రమణా రెడ్డి డైలాగ్స్ లో తెలుగు సామెతలు మరింత గమ్మత్తుగా వినిపించేవి. అప్పట్లో కొంతమంది దర్శకులు తమ సినిమాలో కచ్చితంగా రమణా రెడ్డి ఉండేలా చూసుకునేవారు.

ఇక రమణా రెడ్డి సాంఘికాలు మాత్రమే కాదు .. ఆ పర్సనాలిటీతో జానపద .. పౌరాణిక సినిమాలు కూడా చేశారు. అయితే పాత్ర ఏదైనా .. దాని తీరుతెన్నులు ఎలాంటివైనా నెల్లూరు మాండలికంలోనే ఆయన డైలాగులు చెప్పేవారు. ఆయనకి గల క్రేజ్ కారణంగా .. అదే ఒక ప్రత్యేకతగా నిలవడం వలన ఎవరూ కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఇక ఆయన ఎప్పుడూ ఎవరినీ విమర్శించేవారు కాదు. అందరితోను ఆప్యాయంగానే ఉండేవారు. అందువలన ప్రతి ఒక్కరూ తమ సినిమాలో రమణా రెడ్డి ఉండాలనే కోరుకునేవారు. 

స్వార్థపరుడైన వ్యాపారిగా .. దొంగలెక్కలు రాసే గుమస్తాగా .. ఆస్తిపాస్తులు ఉన్న కుర్రాడికి ఎలాగైనా తన కూతురిని అంటగట్టాలనే దురాశా పరుడిగా ..  భార్యకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టే భర్తగా .. పెళ్లి సంబంధాలు చెడగొట్టే బాపతు పాత్రల్లోను ఆయన జీవించేవారు. రెండు దశాబ్దాలకి పైగా ఆయన ఎన్నో పాత్రలను చేశారు. ఆ సినిమాలను గురించి చెప్పుకోవాలంటే అదో మహా గ్రంథమే అవుతుంది. తరాలు మారుతున్నా .. కామెడీ రూపు రేఖలు మారుతున్నా .. రమణారెడ్డి స్థానం రమణా రెడ్డిదే. ఆ స్థానాన్ని ఆక్రమించడం .. అధిగమించడం మరికారికి సాధ్యం కాదు. ఈ రోజున ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

(రమణారెడ్డి వర్ధంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read

ఆకాశమంతటి ఆలాపన

Also Read :

విభిన్న పాత్రల విలక్షణ నటుడు గోవిందరాజుల

RELATED ARTICLES

Most Popular

న్యూస్