Tuesday, October 3, 2023
Homeసినిమాతెలుగు తెరకు గ్లామర్ పరిచయం చేసిన నటి

తెలుగు తెరకు గ్లామర్ పరిచయం చేసిన నటి

Actress Kanchana In The Hearts Of Telugu Movie Lovers With Her Glamour Roles :

కాంచన .. అలనాటి అందాల కథానాయిక. తెరపై ఆమెను చూస్తే సృష్టికర్తను మించిన చిత్రకారుడు లేడనిపిస్తుంది. నాజూకైన ఆమె నవ్వులు .. నడకలు చూస్తే, అప్సరసలు అసూయపడతారేమోనని అనిపిస్తుంది. వెన్నెలను నింపుకున్నట్టుగా కనిపించే విశాలమైన కళ్లు .. ఆత్మవిశ్వాసానికి ఆనవాలుగా కనిపించే నాసిక … గులాబీ రేకుల్లాంటి పల్చని పెదాలు ఆమె అందానికి ప్రత్యేకతను తీసుకొచ్చినట్టుగా కనిపిస్తాయి. కాంచన మంచి పొడగరి .. మంచి రంగు కావడం వలన, చీరకట్టులోను .. మోడ్రన్ డ్రెస్ లలోను మెరిసిపోయేవారు.

కాంచన అసలు పేరు ‘పురాణం వసుంధరాదేవి’ .. ప్రకాశం జిల్లా ‘కరవది’ గ్రామంలో ఆమె జన్మించారు. మొదటి నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్ గానే ఉండేవారు. ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా ఉండటం .. జరిగిన విషయాలను గురించి అదేపనిగా ఆలోచిస్తూ బాధపడటం ఆమెకి తెలియదు. ఏదైనా సరే తాను సాధించగలననే పట్టుదల .. అందుకు అవసరమైన ధైర్యం ఆమెలో ఉండేవి. అందువలన ఆమె ఒక వైపున చదువును కొనసాగిస్తూనే, మరో వైపున సంగీతం .. భరతనాట్యం నేర్చుకుంటూ వెళ్లారు.

అప్పట్లోనే కాంచన చాలా స్టైల్ గా ఉండేవారు .. ఆ కాలంలోనే ఎయిర్ హోస్టెస్ గా చేశారంటే ఎంత స్పీడ్ గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమె జాబ్ చేస్తూ ఉండగా, తమిళ దర్శక నిర్మాత సీవీ శ్రీధర్ విమాన ప్రయాణం చేస్తూ ఆమెను చూశారు. ఆమె హైటు .. పర్సనాలిటీ .. కనుముక్కుతీరు .. కళ్లలోని మెరుపును చూశారు. తన తాజా  చిత్రంలో కథానాయిక పాత్ర కోసం వెతుకుతున్న ఆయనకి, ఆ పాత్రకి కాంచన కరెక్టుగా సెట్ అవుతుందని అనిపించింది. తన మనసులోని మాటను ఆయన కాంచనతో చెప్పారు. సినిమాల పట్ల గల ఆసక్తితో ఆమె అంగీకరించారు.

అలా తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాతో కథానాయికగా కాంచన పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టేసిన కాంచన, అక్కడి అభిమానుల మనసులను దోచేసుకున్నారు. ఆ తరువాత అదే సినిమాను తెలుగులో ‘ప్రేమించు చూడు’ టైటిల్ తో నిర్మించగా, తమిళంలో తాను చేసిన పాత్రను తెలుగులోను చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఎంతో ఆదరణ పొందింది. అదే ఏడాది అక్కినేనితో చేసిన ‘ఆత్మ గౌరవం’ .. శోభన్ బాబు జోడిగా చేసిన ‘వీరాభిమన్యు’ సినిమా లతో ఆమె కెరియర్ స్పీడ్ పెరిగింది.

 

అందం .. ఆకర్షణ .. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్న కాంచన, చిత్రపరిశ్రమలో గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లారు. అప్పటికే సావిత్రి .. జమున .. కృష్ణకుమారి వంటి కథానాయికలు బరిలో ఉండటం వలన, తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడం కోసం, గ్లామరస్ గా .. మోడ్రన్ గా కనిపించడానికి ఆమె ఎంత మాత్రం వెనుకాడలేదు. చురుకుదనం .. చలాకీదనం కలిసిన పాత్రలను ఎంచుకుంటూ వెళ్లారు. ఆ కొత్తదనమే అభిమానులు ఇష్టపడటానికి ప్రధానమైన కారణమైంది.

ఆధునిక భావాల కారణంగా ఆమె కాస్త దూకుడుగానే ఉండేవారు. ఏ విషయాన్నైనా నానబెట్టం ఆమెకి ఎంత మాత్రం అలవాటు లేని పని. పాత్రల ఎంపిక విషయంలో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్లేవారు. బహు భాషలు తెలిసి ఉండటం వలన చాలా తక్కువ సమయంలోనే ఆమె తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లోను అవకాశాలను సంపాదించగలిగారు. అన్ని చోట్ల తన ప్రత్యేకతను చాటగలిగారు.

తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబులతో సినిమాలు చేస్తూ వెళ్లారు. అందరి కంటే అక్కినేనితో ఆమె ఎక్కువ సినిమాలు చేయగలిగారు. ఇక తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ ల తోను, కన్నడలో రాజ్ కుమార్ తోను కలిసి నటించారు. అనేక విజయాలను అందుకున్నారు. ఆమె చేసిన సినిమాల్లో జానపద .. పౌరాణికాలు కూడా ఉండటం విశేషం. శోభన్ బాబుతో చేసిన ‘వీరాభిమన్యు’ .. ‘కల్యాణ మంటపం’ సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి.

‘కల్యాణ మంటపం’ సినిమాలోని చంద్రముఖి పాత్ర ఆమె నటనకు కొలమానంగా నిలుస్తుంది. ఇక ‘అవేకళ్లు’ సినిమాలో మోడ్రన్ డ్రెస్ లతో .. ఆమె చేసిన మోడ్రన్ డాన్సులు అప్పట్లో యూత్ కి విపరీతంగా నచ్చాయి. అలా అప్పట్లోనే  తెలుగు తెరపై సందడి చేసిన గ్లామరస్ హీరోయిన్స్ లో కాంచన ఒకరిగా కనిపిస్తారు. అయితే కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, కుటుంబ సంభ్యుల కారణంగా ఆమె మనసు గాయపడిందని చెబుతారు. తనవారే తనని మోసం చేయడంతో, ఒక రకమైన విరక్తి భావానికి లోనయ్యారు. అందువల్లనే ఇటు సినిమాలకి .. అటు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకి ఆమె దూరమయ్యారు.

కాంచన పైకి చాలా మోడ్రన్ గా కనిపించినప్పటికీ, ఆమెలో ఆధ్యాత్మిక భావాలు మొదటి నుంచి ఎక్కువే. ఎప్పుడూ కూడా ఆలయాలకు వెళ్లడం .. అక్కడి పూజల్లో పాల్గొనడం చేసేవారట. తన మనసుకు కష్టం కలగడం వలన ఆమె తన దృష్టిని పూర్తి స్థాయిలో దేవుడిపైనే పెట్టారు. తన అవసరాలకు చాలినంత ఉంచుకుని, మిగతాదంతా ఆమె తిరుమల శ్రీనివాసుడికి సమర్పించుకున్నారని చెబుతారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక భావాలతో బెంగుళూరు సమీపంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ రోజున (ఆగస్ట్ 16) ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(బర్త్ డే స్పెషల్)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన ముత్యం

Peddinti Gopi Krishna
Peddinti Gopi Krishna
ఎం.ఏ తెలుగు, బి ఈడి . ప్రింట్, టీ వి, డిజిటల్ మీడియాల్లో పాతికేళ్ల అనుభవం. భక్తి రచనల్లో అందెవేసిన చేయి. సినిమా విశ్లేషణల్లో సుదీర్ఘ అనుభవం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న