His Voice lives Forever: డిసెంబరు 4న ఘంటసాల పుట్టినరోజు కావడంతో ఆకాశవాణి 102.8 రోజు రోజంతా ఘంటసాల పాటలు వినిపించింది. ఆదివారం కావడంతో ఇంట్లో ఉండి అన్ని పాటలు వినే అవకాశం దొరికింది. కాసేపు కార్లో వెళ్ళినప్పుడు కూడా ఎఫ్ఎంలో ఘంటసాల గానం వెంట ఉంది.
వందో పుట్టినరోజు అని రేడియో జాకీలు మధ్య మధ్య ఆయన గురించి పులకింతగా చెప్పిన విషయాలు కూడా బాగున్నాయి.
నిజమే.
ఘంటసాల గానానికి పరవశించకపోతే ఎలా?
ఘంటసాల-
మనందరి ఆస్తి;
పులకింత;
మన మనసుల్లో ప్రవహించే పాట; మనను ఓదార్చే పాట;
మనం తుళ్లిపడుతూ నడిచిన బాట;
మన చెవులకు భగవద్గీత;
ఖంగుమని మోగి…తీగ సాగిన…హృద్యమయిన తెలుగు పద్య నైవేద్యం.
తెలుగును తెలుగులా మాట్లాడకపోవడం, పాడకపోవడం, రాయకపోవడం ఫ్యాషన్ అయిన ఈరోజుల్లో ఘంటసాల గొంతులో ఉన్న పదహారణాల తెలుగు గురించి తెలుసుకుని గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదని అనుకోవాలి.
“కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి…” అని ఘంటసాల కురుక్షేత్ర యుద్ధసీమ నడిమధ్యలో నిలుచుని భీష్ముడి కోసం పోతన పద్యం పాడితేనే కదా కృష్ణుడు రథం మీది నుండి కుప్పించి మన మనోరథాలమీదికి దూకింది!
“జపమేమి జేసెనో జనకమహారాజు కళ్యాణరాముడి కాళ్లు కడుగ…” అని మిథిల పెళ్లి పందిట్లో ఘంటసాల గొంతు విప్పితేనే కదా జగదభిరాముడు సీతమ్మ మెడలో మూడు ముళ్లు వేసింది!
“ఇంతకు పూనివచ్చి వచియింపకపోదునే విన్ము తల్లీ!” అని లక్ష్మణుడి కోసం ఘంటసాల గొంతు బొంగురుపోతేనే కదా…కంకంటి పాపారాజు పద్యం మనకు తెలిసింది?
“ఇదిమన ఆశ్రమంబు…ఇచట నీవు వసింపుము…” అని వాల్మీకి కోసం ఘంటసాల పాడకపోతే అడవి మధ్యలో సీతమ్మ ఏమైపోయేది?
“మాణిక్యవీణాముపలాలయన్తి..” అని ఘంటసాల హై పిచ్ లో శ్యామలా దండకం పాడబట్టే కదా…కాళిదాసు రాశాడని మనకు తెలిసింది!
పద్యం ఎలా పాడాలో? అందులో పెద్ద పెద్ద సమాసాలు పాడేప్పుడు పద్యంలో క్రియా పదంతో అన్వయం జారిపోకుండా దాన్ని ఎలా పట్టుకోవాలో? ఎక్కడ ఒత్తి పలకాలో? మహా ప్రాణాలను ఎంత ఒత్తి పలకాలో? అల్ప ప్రాణాలను ఎలా తేల్చి పలకాలో? పద్యం ముందు ఆలాపన, ముగింపులో రాగం కూడా పద్య భావంతో ఎలా సంలీనం కావాలో? ఘంటసాల పాడకపోతే మనకు ఎలా తెలిసి ఉండేది?
“ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడ…” అని దుర్యోధనుడి పరువు తీసిన అర్జునుడికి ఘంటసాల పాడకపోతే ఆ సమయంలో అర్జునుడికి నోట్లో మాట పెగిలేదా?
“హే కృష్ణా! ముకుందా! మురారి!” అని ఘంటసాల పాడకపోతే తెలుగు కృష్ణుడి డ్యాన్సుకు కాలు కదిలేదా?
“శివశంకరీ! శివానందలహరి…” అని ఘంటసాల గొంతు విప్పకపోతే ఆ రాళ్లు కరగక ఎప్పటికీ అలాగే ఉండి రామారావు జగదేకవీరుడు కాలేక ఆ రాళ్ల మధ్యే ఇరుక్కుని రాయిలో రాయిగా ఉండిపోయేవాడు కదా?
“పాడుతా తీయగా…” అని ప్రతి అక్షరానికి తెలుగు తేనెలు పూసి ఘంటసాల పాడకుండా ఉండి ఉంటే…కొన్ని కోట్ల మూగమనసులు ఎప్పటికీ మూగగా పడి ఉండేవి కదా?
ఆనందాలు- ఆవేదనలు
విషాదాలు- వైరాగ్యాలు
ఉత్సాహాలు- ఉరుకులు
మెరుపులు- వెలుగులు
ప్రార్థనలు- స్తోత్రాలు
పద్యాలు- పాటలు- దండకాలు
పుష్పవిలాపాలు- పూల సోయగాలు
భగవద్గీతలు- భగవంతుడి లీలలు
విరిసే కన్నుల్లో వేయి భాషలు
పసందయిన భలే మంచి రోజులు
ఒకటా? రెండా?
ఎన్నెన్ని సందర్భాలు?
ఎన్నెన్ని గొంతులు?
ఎంత రాస్తే ఘంటసాల గొంతుకు సరితూగుతుంది?
పాడడానికే పుట్టినవాడు ఘంటసాల.
మన పాటలు మనం పాడుకోలేము కాబట్టి...మీపాట నా నోట పలకాల అని కలకాలం నిలిచిపోయేలా పాడినవాడు ఘంటసాల. పాడిన ప్రతి పాటకు ప్రాణం పెట్టినవాడు ఘంటసాల. పాట ఉన్నంతవరకు పాటకు ప్రాణదీపమై వెలిగేవాడు ఘంటసాల. తెలుగు పాటకు పాఠశాల మన ఘంటసాల.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :
Also Read :