విశ్వ వినువీదిలోకి తొలిసారిగా తెలుగు అమ్మాయి పయనం అవుతోంది. భారతీయ యువతి ౩౦ ఏళ్ళ శిరీషకు ఈ అవకాశం దక్కింది. ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్, స్పేస్ ఇండస్ట్రీ లో ఎంబిఏ పూర్తి చేసిన శిరీష వర్జిన్ గేలాక్టిక్ సంస్థలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తోంది. అసమాన ప్రతిభతో మేనేజర్ స్థాయి నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుంది. శిరీష తల్లితండ్రులు మురళీధర్, అనురాధ అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు. అక్క ప్రత్యూష వర్జీనియా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. వీరి కుటుంబం టెక్సాస్ లోని హోస్టన్ నగరంలో స్థిరపడింది.
ఈ నెల పదకొండో తేదీన అమెరికాకు చెందిన వర్జిన్ గేలాక్టిక్ సంస్థ న్యూ మెక్సికో నుంచి వాహక నౌకను పంపనుంది. సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో కలిసి ఆరుగురి బృందం తొలిసారిగా ఈ వాహక నౌకలో పయనమవుతున్నారు. ఆరుగురు వ్యోమోగాముల బృందంలో ఏకైక మహిళ శిరీష కావటం విశేషం. అంతరిక్షయానం చేయాలన్న చిన్ననాటి కల నేరవేరుతోందని శిరీష సంతోషం వ్యక్తం చేసింది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షయానం చేయబోతున్న భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిరీష బండ్ల పయనంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిరీష తాతయ్య బండ్ల రాఘవయ్య వ్యవసాయ శాస్త్రవేత్త గా పల్నాడు ప్రాంతంలో సుపరిచితులు. చిన్ననాటి నుంచి స్పేస్ సెంటర్స్ సందర్శించటం, అక్కడి విశేషాలు తెలుసుకోవటం శిరీషకు ఇష్టంగా ఉండేదని తల్లిదండ్రులు చెపుతున్నారు. తనకు ఇష్టమైన రంగంలో శిరీష రానిస్తున్నందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు సంతోషం వెలిబుచ్చారు.