Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫుట్ నోట్సులు వున్నది కవిత్వం కాదు

ఫుట్ నోట్సులు వున్నది కవిత్వం కాదు

Lyrics-Poetry:

ఫుట్ నోట్సులు వున్నది కవిత్వం కాదు
అక్షరానికి అక్షరమే వివరణ
అథోజ్ఞాపికలెందుకు?
కవిత్వం కావాలి కవిత్వం అంటూ..
త్రిపుర్నేని శ్రీనివాస్ రగిల్చిన నిప్పురవ్వలవి.

చంద్రబోస్ పాట మీద వివాదం చూస్తే ఈ వాక్యాలు గుర్తొచ్చాయి.
ముఖ్యంగా చంద్రబోస్ వివరణ చూస్తే జాలేస్తోంది.
అతని ఉక్రోషం చూస్తే పాపమనిపిస్తుంది.
బాగారాసాననుకున్న పరీక్షలో ఫెయిలయిన స్టూడెంట్ లా అనిపించాడు..
సిక్స్ అనుకున్న బాల్ ని బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటైన బ్యాట్స్ మేన్ లా గింజుకున్నాడు.

అతని పాటలో ఏం తప్పులున్నాయో ఇప్పటికే చాలా చర్చ జరిగింది.
కనుక మళ్ళీ వాటి జోలికి వెళ్లను. కానీ,
బోస్ సమర్థనలో మాత్రం చాలా అసమంజసాలున్నాయి.
అసలు అతను చెప్పిన విరోధాభాస నిర్వచనమే కొంత రసాభాసప్రహసనంగా అనిపించింది.
అయితే చర్చ అది కాదు..
అసలు ఈ కవులు కాసింత విమర్శని కూడా ఎందుకు తీసుకోలేరు?
కోట్లాది మందికి నచ్చేపాటలో ఒకరిద్దరికి ఏవో అభ్యంతరాలుంటే వుండొచ్చని ఎందుకనుకోరు?
బూతుకవి అన్నా ఆరుద్ర పెద్దగా పట్టించుకోలేదు.
డబుల్ మీనింగ్ లు రాస్తాడన్నా వేటూరి వాటికి టీకాతాత్పర్యాలు చెప్పలేదు.
అసలు జనంలో వుండే విమర్శలను ఆ తరం పెద్దగా పట్టించుకోలేదు.
ఏ సన్నివేశానికి ఎంత అవసరమో అంత రాస్తూ పోయారు.

కానీ, ఇప్పటి కవులు అలా లేరు.
సిరివెన్నెల లాంటి సున్నిత మనస్కుడితోనే ఈ ట్రెండ్ మొదలైంది.
బలపం పట్టి భామ వళ్లో అని తను రాసిన పాటలో అసలర్థం జనాలకి తేలికగానే అర్థమైంది.
కానీ సిరివెన్నెల మాత్రం దానికో తాత్విక తాత్పర్యం చెప్పడానికి చాలా తంటాలు పడ్డారు.
మొన్నీ మధ్య “కాళ్లను పట్టుకు వదలన”ప్పుడు కూడా దాన్ని పసిమనసుకి ఆపాదించాలని వృధాప్రయత్నం చేసాడు.

అనంత్ శ్రీరామ్ అయితే, తనపాటల్నేకాదు..తనపాటల్ని పాడేవాళ్ళని కూడా
గుడ్డిగా వెనకేసుకొచ్చాడు.
ఉంటేకి ఉల్టేకి అర్థబేధం లేదని సరికొత్త వ్యాకరణమేదో చెప్పాలని చూసాడు.

సారంగదరియా పాట ఓనర్షిప్ గొడవతోపాటు, అసలు సారంగదరియా అనే పదానికి అర్థమేంటనే చర్చలో సుద్దాల అశోక్ తేజ చాలా రోజులు ఖర్చు చేసాడు.

ఇప్పుడు పాటరాయడం ఒకతెత్తైతే, దాన్ని సమర్ధించుకోవడం మరొక ఎపిసోడ్ అవుతోంది.
నిజానికి ఒకటిరెండు విభిన్న అభిప్రాయాల వల్ల ఈ కవుల గొప్పతనానికి వచ్చిన ముప్పేం లేదు.
రెండుపాటలో, వాటిలోని రెండు పదాలో సిరివెన్నెల సాహిత్య గౌరవాన్నితగ్గించలేవు.
అనంత్ శ్రీరామ్, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోసు .. ఎవరికి వాళ్లు కవిదిగ్గజాలే..
వీళ్లందరికీ పాట మీద ఎంత ప్రేమో..సాహిత్యం అంటే అంతే శ్రద్ధ.. భక్తి.
భాష మీద పట్టుంది. భావం మీద అధికారం వుంది.
వేల పాటలు రాసి, కోట్లాది మంది ప్రేక్షకుల్ని మెప్పించిన వాళ్లే వీళ్ళంతా…
కనుక అక్కడక్కడా దిష్టిచుక్కల్లా ఒకటో రెండో విమర్శలొస్తే హుందాగా తీసుకోవాలి..
లేదా లెక్కచేయకుండా తమ పని తాము చేసుకోవాలి.
అంతేకానీ, ఇలా వివరణలిచ్చుకుంటూ పోతే ఏమొస్తుంది?
పాటవల్ల వచ్చిన గౌరవం అనవసర మాటల వల్ల పోగొట్టుకుంటారు.


చివరగా విమర్శకులకు కూడా ఓ మాట.
త్రివిక్రమ్ అన్నట్టు..
హీరోల ఇమేజ్ ని,
దర్శకుల అర్థం లేని తనాన్ని,
ప్రొడ్యూసర్ల వ్యాపార అవసరాల్ని,
దాటుకుని రచయిత అష్టకష్టాలు పడి ఒక పాట రాస్తాడు..
అందులో మరీ శల్యపరీక్షలు చేసి రసభంగం కలిగించడం ఒక పనిగా పెట్టుకోకండి.
కవుల సున్నిత మనస్సుల్ని గాయపరిస్తే ఏమొస్తుంది చెప్పండి.

-శివప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్