Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు పద్యం వెలుగు

తెలుగు పద్యం వెలుగు

Long Live Telugu Natakam:

“ఇంతకు బూనివచ్చి వచియింపక పొదునె విన్ము తల్లి దు
శ్చింతులు, ధైత్యుచేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్న వా
డెంతటి విమోహి రాముడని, యెగ్గులు పల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానల లోపల డించి రమ్మనెన్”

లోకనిందకు సీతమ్మను అడవిలో వదిలిపెట్టి రమ్మన్న అన్న రామన్న ఆజ్ఞను పాటించి…వల వల ఏడ్చిన లక్ష్మణుడికి కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో ఈ పద్యం రాయకపోతే లక్ష్మణుడి ఏడుపేమిటో మనకు ఎన్నటికీ తెలిసేదే కాదు.

“జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్”

రథం “జెండాపై కపిరాజు” కూర్చుని ఉండగా…అర్జునుడు గాండీవం పట్టి రథంమీద నుండి శత్రువులను చెండాడుతూ ఉండగా…సాక్షాత్తు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండగా…ఒక్కడు కూడా దుర్యోధనుడి మాటవినేవాడు ఉండడు అని మనల్ను కురుక్షేత్ర యుద్ధానికి ముందే యుద్ధసీమలోకి తీసుకెళ్లింది తిరుపతి వెంకటకవుల పద్యం.

“బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే, భ్రాతల్, సుతుల్, చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై చెలంగుదురె, నీ తేజంబు హెచ్చించుచున్”
బావా! ఎప్పుడు వచ్చితివి? అన్న వెంకటకవుల పద్యపాదం తెలుగు వాడుకమాట అయ్యింది.

“ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి
రం భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము
దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత!
భగ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!”

భీముడి నోట్లో పడి నన్నయ్య తెలుగు పద్యం బాహు పరివర్తిత చండ గదాభిఘాతమయ్యింది.

“కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్
మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్
లోక భీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ
నిర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!”

భీముడి ప్రతిజ్ఞకు నన్నయ్య పేర్చిన “తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని ర్ఝర” పదబంధంలో కోపం కట్టలు తెంచుకుంటోంది.

“ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీధుల గ్రాలగలదె
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డోలగంబున నుండగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపార భోగింపగలదె

కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము”
ఉత్తరగోగ్రహణ వేళ బృహన్నల వేషంలో ఉత్తరకుమారుడి సాక్షిగా అర్జునుడు దుర్యోధనుడి పరువు పంచనామా చేయడానికి తిక్కన నాటకీయమైన ఈ పద్యం లేకపోతే ఆ క్షణాన అర్జునుడి మాటకు విలువేముంది?

“భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి వారణాసి”
సత్యహరిశచంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రాసిన ఈ పద్యం కాశీ మెడలో హారమై వెలుగుతోంది.

“ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌
కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌”

“ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరిగిపోయె

ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
అధికార ముద్రిక లంతరించె

ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో కలిసిపోయె

ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు”

బలిజేపల్లి సత్యహరిశచంద్ర నాటకం కాటి సీను మధ్యలో ఈ జాషువా పద్యాలతో శ్మశానానికి తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన సాహితీ సెలెబ్రిటీ హోదా దక్కింది.

ఇవన్నీ పద్యనాటకాల్లో పెట్టకపోతే పండితులకు తప్ప…మనకు తెలిసేవి కావు. తెలుగు భాషకు పద్యం కొన్ని శతాబ్దాలపాటు ఎలా వారధిగా ఉందో…అలా పురాణ కథలను సామాన్యజనానికి చేరవేయడంలో పద్యనాటకాలు వారధిగా పనిచేశాయి.

ఒకప్పుడు చదువురానివారు కూడా నాటకాల్లో తెలుగు పద్యాలు పాడుకుంటూ మైమరచిపోయేవారు. ఇప్పుడు ఊపిరి బిగబట్టి పద్యం పాడేవారు లేరు. ఉన్నా వినేవారు లేరు. విన్నా అర్థం చేసుకోగలిగిన వారిని దివిటీలు పెట్టి వెతకాలి.

అర్థమైనా…కాకపోయినా…తెలుగు పద్యం నోరారా చదవండి. వీలయితే మీనోటికొచ్చిన రాగంలో పాడండి. చెవులారా వినండి. మంత్రమై మిమ్మల్ను కాపాడుతుంది- దేశభాషలందు తెలుగు లెస్స అన్న సాహితీసమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల పద్యం సాక్షిగా.

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరులో 2023 డిసెంబరు 23 నుండి 29 వరకు వారంరోజులపాటు నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల్లో పద్యనాటకాలను చూసిన నేపథ్యంలో)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్