Telugu Trending Folks Songs :
సారంగ దరియా పాటలో నిజానికి కొన్ని పదాలకు అర్థం ఉందో? లేదో? కూడా తెలియదు. కానీ యూ ట్యూబ్ లో 30 కోట్ల మంది చూశారు.
ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు కూడా. ఇటీవలి కాలంలో ఇదొక సంచలనం. అందులో రాగం మనసును కట్టిపడేస్తుంది. గానం వెంటపడుతుంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. విన్న ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. రచయిత ఎవరో తెలియని ఒక జానపదమిది. దాన్ని సుద్దాల అశోక్ తేజ వాడుకున్నారు. ఈ విషయంలో కొంత వివాదం జరిగి సద్దు మణిగింది.
యూ ట్యూబ్ లో సారంగ దరియా పాటను ఇప్పటికి 30 కోట్ల మంది చూశారంటే-
తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎనిమిదిన్నర కోట్లు; మిగతా రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారినందరినీ ఉదారంగా కలుపుకున్నా మొత్తం తెలుగువారి సంఖ్య పది కోట్లు దాటదు. అలాంటిది 30 కోట్ల మంది ఎలా చూస్తారు? అన్న సందేహం రావడం సహజం. ఒకరే పది సార్లు చూస్తే యూ ట్యూబ్ దాన్ని పది మంది చూసినట్లు చెప్పుకుంటుంది. కళ్లు లేని యూ ట్యూబ్ అలా కృత్రిమంగా, యాంత్రికంగా లెక్కించుకుంటోంది. ఆ గొడవ ఇక్కడ అనవసరం.
సారంగదరియా పాటలా ఇప్పుడు
“బుల్లెట్ బండెక్కి వత్తా పా”
తెగ వైరల్ అయి బుల్లెట్ లా దూసుకుపోతోంది.
ఇప్పటికి దాదాపు నాలుగు కోట్ల మంది చూశారు. తప్పకుండా ఈ సంఖ్య త్వరలో పది కోట్లు కూడా దాటవచ్చు. ఇలాంటి జానపద బాణీ గీతాలు రాయడంలో అందెవేసిన చేయి లక్ష్మణ్ రాయగా మోహన భోగరాజు పాడింది ఈ పాటను. తెలంగాణ మాండలికంలో ఉన్న మాధుర్యం దెబ్బ తినకుండా మోహన గొప్పగా పాడింది. జానపదం వ్యక్తీకరణలో యాస, దాన్ని పలికే తీరే ప్రధానం.
కెవ్వుకేకలు వేస్తూ రత్తాలు బొత్తాలు కుట్టాల్సిన
మి మ్మీ మిమ్మిమ్మీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ లాంటి అతిరథ మహారథులు రాసి, బాణీలు కట్టి, పాడి, మైమరచి నృత్యం చేసిన పాపులర్ సినిమా పాటలతో పోలిస్తే “బుల్లెట్ బండెక్కి వత్తా పా” కోటి రెట్లు నయం. నిజానికి ఇలాంటి జనం పాటలను అలాంటి సినిమా పాటలతో పోల్చకూడదు.
ఈ మధ్య ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన పెళ్లి కూతురు…పెళ్లి కొడుకును సర్ప్రయిజ్ చేయడానికి పెళ్లి ఊరేగింపులో, పెళ్లి బట్టలతో, మెడలో పూలదండతో బుల్లెట్ పాటకు నృత్యం చేస్తే ఆ వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది.
కొన్ని పాటల అర్థం, భావం, సందర్భంతో పని లేదు. అవి బాగా పాపులర్ అయ్యాక అన్ని చోట్లా, అన్ని వేదికల మీదా పాడేస్తూ ఉంటారు. లేదా పాట వినపడితే గంతులేస్తూ ఉంటారు. అలా ఆగస్టు పదిహేను రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక స్టాఫ్ నర్సు బుల్లెట్ బండెక్కి వత్తా పాటకు మైమరచి డ్యాన్స్ చేసింది.
Telugu Trending Folks Songs
అది కాస్త వైరల్ అయ్యేసరికి కలెక్టర్ ఆమెకు మెమో ఇచ్చి సంజాయిషీ అడిగారు. ఆగస్టు పదిహేను సెలవు. అందరూ వెళ్ళిపోయాక సరదాగా డ్యాన్స్ చేశాను. తప్పే. ఇకపై ఇలా జరక్కుండా చూసుకుంటాను – అని ఆమె వివరణ ఇచ్చుకుంది. ఆక్కడితో ఈ వివాదం సద్దు మణిగి ఉండాలి.ఏమాటకా మాట- ఆ పెళ్లి కూతురయినా, ఈ స్టాఫ్ నర్స్ అయినా చూడ ముచ్చటగా అభినయించారు. నాట్యం చేశారు. పాటకు పదం కలిపే గుణమున్న మనుషులకు ఇలాంటి సందర్భాల్లో కాలు నిలువదు.
శిలలు కరిగే సంగీతానికి కూడా బిగుసుకుని కనీసం తల ఊపకుండా, తొడ మీద చేత్తో దరువయినా వేయకుండా శిలలా ఎలాంటి స్పందన లేకుండా మనమంటే ఉండగలం కానీ…కొందరు అలా ఉండలేరు. రాగం వెంట గొంతు విప్పుతారు. పాటకు పదం కలిపి గంతులేస్తారు. ఊగిపోతారు. తమను తాము ఆవిష్కరించుకుంటారు. అభినయిస్తారు. కళ్లల్లో, చేతుల్లో భావాన్ని పలికిస్తూ ఆనందిస్తారు. మనమయితే సిగ్గుతో కూడిన భయంవల్ల కలిగిన మొహమాటంలో నుండి పుట్టిన పిరికితనం కారణంగా కనీసం గట్టిగా చప్పట్లు కూడా కొట్టలేము. కొందరలా కాదు.
కరోనాలు కోరలు చాచి జీవితాలను నిస్సారంగా, నిర్జీవంగా మార్చిన వేళల్లో ఆ నర్సమ్మ ఎన్ని విషాదాలకు వైద్య సేవలు అందించిందో? ఎన్ని పాజిటివ్ లు నెగటివ్ వచ్చేవరకు ఎన్నెన్ని సేవలు చేసిందో? ఎంతగా అలసిపోయి ఉందో? ఎంతగా అణిగిపోయి ఉందో? ఎంతగా దిగులు పడి ఉందో?
స్వాతంత్ర్య దినోత్సవం రోజున…అందరూ వెళ్లగానే తోటి నర్సుల ముందు స్వతంత్రంగా తనను తాను ఆవిష్కరించుకుంది. తప్పొప్పుల లెక్కలు జానే దో.
“మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. ఊరికే తిని తొంగుంటే మనిసికి గొడ్డుకు తేడా ఏముంటుంది?”
-పమిడికాల్వ మధుసూదన్
Also Read: అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక
Also Read: ఇంగ్లీషులో తెలుగు ఏడుపు